11, మే 2023, గురువారం

చంద్రగిరిలో సైకిల్ ఎక్కేది ఎవరు ?

 చంద్రగిరిలో  సైకిల్ ఎక్కేది ఎవరు ?



                              ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజక వర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లె చంద్రగిరి నియోజక వర్గంలో ఉంది. ఆయన 1978 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1983లో టిడిపి అభ్యర్థి వెంకట్రామ నాయుడు చేతిలో ఓడి పోయారు. 1989 నుంచి కుప్పంలో వరుసగా గెలుస్తున్నారు. టిడిపి ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో 1985 లో జయదేవ నాయుడు, 1994 నారా రామమూర్తి నాయుడు గెలిచారు. 1989, 1999, 2004, 2009లో నాలుగు సార్లు కాంగ్రెస్ టిక్కెట్ పై గల్లా అరుణ కుమారి గెలిచారు. ఆమె మంత్రిగా పనిచేశారు. అయితే 2014 లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో  ఓడిపోయారు. 2019 టిడిపి అభ్యర్ధి పులివర్తి నాని ఓటమి పాలయ్యారు.


                           ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కీలకమైన కొన్ని అంశాలు వెల్లడి అవుతున్నాయి. 2008 లో నియోజక వర్గాల పునర్విభజన జరగక ముందు చంద్రగిరిలో చంద్రగిరి, పాకాల, పులిచెర్ల, ఐరాల మండలాలు ఉన్నాయి. నాలుగింటిలోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఘననీయంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తొలినుంచి కమ్మ సామాజిక వర్గం వారికే టిక్కెట్ ఇస్తూ వచ్చింది. అలాగే టిడిపి కూడా అదే సామాజిక వర్గం వారికి టిక్కెట్టు ఇచ్చారు. అయినప్పటికీ  2009 ముందు వరకు ఆరు  సార్లు జరిగిన ఎన్నికల్లో చెరి మూడు సార్లు విజయం సాధించారు. పునర్విభజన తరువాత చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, తిరుపతి రూరల్, యర్రావారిపాలెం, చిన్నాగొట్టిగల్లులతో  నియోజక ఏర్పడింది. ఇందులో మొదటి మూడు మండలాలలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు రెడ్ల కంటే కొద్ది ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన మూడు మండలాలలో పూర్తిగా రెడ్లదే  ఆధిపత్యం.

                  


                         ఇది గమనించిన చంద్రబాబు నాయుడు 
2009 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన  రోజాకు  టిక్కెట్టు ఇచ్చారు. అయితే ఆమె కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారి చేతిలో 10,980 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్ధి సైకం  సాయి రమణి రెడ్డికి 29,833 ఓట్లు వచ్చాయి. రెడ్ల ఓట్లు రోజా, సాయి రమణి మధ్య చీలడం, టిడిపికి అనుకూలమైన బలిజ ఓటర్లు పిఆర్పీ వైపు మొగ్గు చూపడంతో టిడిపి ఓడిపోయింది. అయితే 2014 ఎన్నికల్లో రోజా YCPకి  వెళ్లి నగరిలో పోటీ చేయడంతో చంద్రబాబు గల్లా అరుణ కుమారికి టిక్కెట్టు ఇచ్చారు. ఆమె YCP అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 4,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా  TDP అనుకాల పవనాలు వీస్తున్న సమయంలో అరుణకుమారి ఓడి పోవడానికి రెడ్ల ఓట్లు అధికంగా ఉండటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పులివర్తి నానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 41,755 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థి అయితే మంచిదని రాబిన్ శర్మ టీమ్ చంద్రబాబుకు నివేదిక అందించినట్లు  తెలిసింది.

        


               అయితే ఇటీవల పాదయాత్రకు వచ్చిన లోకేష్ నియోజక వర్గం ఇంచార్జి  నానీ  అభ్యర్ధి అంటూ ప్రకటించడంతో కుల సమీకరణలకు బ్రేక్ పడింది. నాని పాకాల మండలం పులివర్తివారి పల్లికి చెందిన వారు. గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేశారు. నానీ ఏప్రిల్ నెల నుండి 
మీ ఇంటి వద్దకు .. మీ పులివర్తి నాని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ప్రజల మధ్య తిరుగుతూ తనను ఈ సారి గెలిపించాలని కోరుతున్నారు. నాని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నాని కమ్మ కులానికి చెందినా, రెడ్డి కులానికి చెందిన సుధా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కావున, కమ్మ, రెడ్డి ఓట్లు తనకు వస్తాయని, తప్పక గెలుస్తామని ధీమాతో ఉన్నారు.

                  


                   అయితే పెనుమూరు మండలానికి చెందిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారు. అయనకు నాలుగు మండలాలలో బంధు వర్గం ఉందని, అయనకు టిక్కెట్టు ఇస్తే దాని ప్రభావం జి డి నెల్లూరు నియోజక వర్గంలో కలసి వస్తుందని ఆయన మద్దతు దారులు అంటున్నారు. 
డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆయనకు  రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యత ఇచ్చారు. ఇటీవల పుంగనూరు పరిశీలకునిగా కూడా నియమించారు. జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వామి, రోజాపై విమర్శల వర్షం కురిపిస్తూ జిల్లాలో ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఆయన ఆర్ ఎస్ ఎస్ చిత్తూరు తాలూకా కార్యవాహ, ఎబివిపి జిల్లా కన్వీనర్, విశ్వహిందూ పరిషత్ తిరుపతి పట్టణ అధ్యక్షుడుగా పనిచేశారు. యువ జనతా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ గా ఉన్నారు. 1983 లో పుత్తూరు నుంచి జనతా అభ్యర్థిగా పోటీ చేశారు. 2011లో తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీగా బరిలో నిలిచారు. 1999 ఎన్నికల్లో పుత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు వ్యతిరేకంగా పనిచేశారు. ఎన్నికల్లో TDP అభ్యర్థి రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి గెలుపుకు కృషి చేశారు. దీంతో అప్పటి PCC అధ్యక్షుడు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సుధాకర్ రెడ్డిని ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. 
             

            దీంతో ఆయన రాజకీయాలు వీడి వ్యక్తిత్వ వికాస శిక్షణ, కౌన్సెలింగ్ వృత్తిగా స్వీకరించారు. అలాగే ఆయన ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో విలేఖరిగా పనిచేశారు. తరువాత ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కాలమిస్టుగా ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఆరు పిజిలు, ఆరు డిప్లొమాలు చదివారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రులు రెడ్డివారి చెంగా రెడ్డి, గల్లా అరుణ కుమారి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి కె బాబు తో సన్నిహితంగా ఉండేవారు. చంద్రగిరి నియోజక వర్గంలో తన ఉప కులమైన పెడకంటి రెడ్లు, బంధువర్గం  ఓట్లు గణనీయంగా ఉన్నాయి. నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి కొందరు కాంగ్రెస్, వైకాపా నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చంద్రగిరిలో పోటీ చేస్తే  తన సామాజిక వర్గం బలంగా ఉన్న జి డి నెల్లూరు నియోజక వర్గంలో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

                 


                   అలాగే చంద్రగిరి మండలం పెరుమాళ్ళపల్లికి  చెందిన  ప్రముఖ పారిశ్రామిక వేత్త డాలర్ దివాకర్ రెడ్డి కూడా పోటీకి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయన 2009 ఎన్నికలలో PRP టిక్కెట్టు కోసం ప్రయత్నం చేశారు. అయన ఇటివల పార్టీ అధినేతను కలిసి ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. ముందు పార్టీలో చేరాలని అన్నట్లు  సమాచారం. దివాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆర్థికంగా బాగున్నారు.
 అయితే చంద్రబాబు సర్వేల ఆధారంగా టిక్కెట్టు ఇస్తారని సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రగిరి TDP టిక్కెట్టు ఎవరిని వరిస్తుందో చూడాల్చిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *