మామిడి మద్ధతు ధర రూ.19 : జిల్లా కలెక్టర్
మామిడి మద్ధతు ధర రూ.19 : జిల్లా కలెక్టర్
మామిడి పంట విషయంలో రైతులు, కొనుగోలుదారులు ఒక మాటపై ఉందామని కలెక్టర్ సగిలి షణ్మోహన్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన పంట మామిడి అని, మామిడి పంట చిత్తూరు జిల్లాకు గుర్తింపు తెచ్చిన పంట అనితెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మామిడి పంట సమస్యలను పరిష్కరించి రైతులకు మేలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మామిడి కోత మొదలైంది కాబట్టి ప్రభుత్వం తరపున రైతులకు పెట్టుబడికి తగ్గ ఫలితం కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
దశల వారీగా కోత కోయాలి ....
రైతులు మామిడి పంటను దశల వారీగా కోత కోయాలని కలెక్టర్ తెలిపారు. గతంలో ఉన్న సమస్యలను బేరీజు చేసుకుని క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రేటు రాదేమో అని రైతులు భయపడకూడదన్నారు. పండు పక్వానికి వచ్చిన తర్వాత కోత కోయడం వల్ల కొనుగోలుదారులకు, రైతులకు మంచి జరుగుతుందన్నారు.
ర్యాంపుల వద్ద నిరంతర నిఘా....
జిల్లా వ్యాప్తంగా పలు ర్యాంపుల వద్ద రైతులకు మోసం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ అన్నారు. మోసాల ను కట్టడి చేసేందుకు ర్యాంపుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షణకు ప్రభుత్వ సిబ్బందిని నియమించామన్నారు. అక్కడ పరిశీలించాల్సిన విషయాలపై సిబ్బందికి లీగల్ మెట్రాలజీ అధికారులచే శిక్షణ ఇప్పించామని తెలిపారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ర్యాంపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మామిడి పండ్లు త్వరగా పక్వానికి వచ్చేందుకు వినియోగించే కాల్షియం కార్బైట్ ను బ్యాన్ చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా వినియోగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మద్ధతు ధర రూ.19.....
మే 10 వ తేదీ నుంచి మే 20 వ తేదీ వరకు జిల్లాలో మామిడి మద్ధతు ధర రూ.19 ని కలెక్టర్ ప్రకటించారు. ఆ మద్ధతు ధర అన్ని ఫ్యాక్టరీలలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. 20 వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించి తదుపరి మద్ధతు ధరను ప్రకటించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రకటించిన మద్ధతు ధరను రైతులు, కొనుగోలుదారుల సమక్షంలో నిర్ణయించడం జరిగిందని వెల్లడించారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ..... రాష్ట్రప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని తెలిపారు. మామిడి కోత కోసేటప్పుడు రైతులు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మామిడి 54,370 హెక్టార్‌లలో (1,36,000 ఎకరాల్లో) సాగు ఉందన్నారు. దాదాపు 68 వేల మంది రైతులు మామిడిని సాగు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన దిగుబడిని మూడు విడతలుగా కోయడం వల్ల కాయలు సైతం 3 దశలలో వృద్ధి చెందుతాయన్నారు. రైతులందరికీ మేలు కలిగేలా మద్ధతు ధరను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ నెల 11 వ తేదీ నుంచి అన్ని డివిజన్‌లలో రైతు భరోసా కేంద్ర సిబ్బందికి మామిడి కోతలపై శిక్షణ కల్పించి, వారి ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి మధుసుధన్‌రెడ్డి, పండ్ల పరిశ్రమ సమాఖ్య నాయకులు గోవర్ధన్‌బాబీ, శివకుమార్ తదితర రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.