పూతలపట్టు నియోజకవర్గ టిడిపీకి దిక్కెవ్వరు?
పూతలపట్టు నియోజకవర్గ టిడిపీకి దిక్కెవ్వరు?
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన డాక్టర్ రవి (Doctor Ravi) రాష్ట్ర వుభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఈ పర్యాయం ఎన్నికల్లో నిలబడి ఉత్తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కలిసి తన మనసులోని మాటను తెలియజేశారు.
అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గతంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ సప్తగిరి ప్రసాద్ (Doctor Sapthagiri Prasad) కూడా ఈ పర్యాయం టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఆయన ప్రజా వ్యతిరేక సమస్యల పైన నిరంతరం పోరాడుతూ, అధికారులను కలుస్తూ, విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. పూతలపట్టుకు చెందిన దళిత సంఘ నేత ఆనగల్లు మునిరత్నం (Anagallu Muniratnam) ఎన్నికల బరిలో ఉన్నారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్ముగంకు కొడుకు వరసయ్యే మునిరత్నం దళిత సంఘ నేతగా చురుగ్గా పార్టీ, దళిత సంఘ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. శాసనసభ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా, టిడిపి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఎస్సి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకేల్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో రాజకీయ నేపథ్యం ఉన్న తనకు సీటును కేటాయించాల్సిందిగా కోరుతున్నారు.
అలాగే తవణంపల్లి మండలానికి చెందిన కోదండయ్య (Kodandaiah) ఎన్నికల బరిలో ఉన్నారు. అయన ఆర్టీసీ డ్రైవర్ గా ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తవణంపల్లి జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొందారు. అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా, మండల అసైన్మెంట్ కమిటీ సభ్యుడిగా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మండల పార్టీ కార్యదర్శిగా, జనచైతన్య యాత్రల ఇన్చార్జిగా వ్యవహరించారు. కాణిపాకం వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా పనిచేశారు. నియోజకవర్గంలో తనకున్న బంధుగణం దృష్ట్యా తనకు సీటు కేటాయించాల్సిందిగా కోదండయ్య కోరుతున్నారు. సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ (Cine Actor Sapthagiri Prasad) కూడా ఈ పర్యాయం పూతలపట్టు టిక్కెట్ ను ఆశిస్తున్నారు. సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ ఐరాల మండలానికి చెందినా, బంగారుపాలెం మండలంలో తన విద్యాభ్యాసం జరిగింది. తండ్రి అటవీ శాఖ ఉద్యోగి కావడంతో బంగారుపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో చదివి సినీ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన పుష్పరాజ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. తనకు కానీ, తన కుమారుడికి గాని పార్టీ టికెట్ ను కేటాయించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు.
పూతలపట్టుకు చెందిన పారిశ్రామిక వేత్త ముత్తు కూడా తెదేపా టిక్కెట్టును ఆశిస్తున్నారు. అయన నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయానికి తన వంతు కృషి చేసినట్లు తెలుస్తుంది. పూతలపట్టు మండలం గొడుగు చెంతకు చెందిన మీడియా విలేకరి మురళి కూడా ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తనదైన శైలిలో పార్టీ అధిష్టానాం దృష్టిలో పడడానికి ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే అధిష్టానం నెల్లూరుకు చెందిన శ్రీధర్ ను నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించింది. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులను పరిశీలించి, ముఖ్య నేతలతో చర్చించి గెలుపొందే అవకాశం ఉన్న అభ్యర్థులను సూచించాల్సిందిగా అధిష్టానం కోరింది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించి పార్టీ పరిస్థితిని అధ్యయనం చేశారు. ముఖ్యనేతలతో చర్చించారు. నివేదికను తయారుచేసి అధిష్టానికి అధిష్టానానికి అందజేయడానికి సిద్దం అవుతున్నారు. మూడు పర్యాయాలు ఓటమిపాలైన పార్టీని ఈ పర్యాయం విజయపథంలో నడిపించడానికి అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఎలాగైనా పూతలపట్టు స్థానాన్ని దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.