రెక్కల పురుగుల నివారణకు వెలుతురు ఎర
మామిడిలో రెక్కల పురుగుల నివారణకు వెలుతురు ఎరను వాడండి
రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ కొత్తూరు బాబు
మామిడి కాయలకు కీడు చేసే రెక్కల పురుగుల నివారణకు వెలుతురు ఎర అద్బుతంగా పనిచేస్తుందని చిత్తూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ కొత్తూరు బాబు అన్నారు. శుక్రవారం చిత్తూరు కొండారెడ్డి పల్లెలోని చిత్తూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యాలయంలో మామిడి రైతులకు ఉచితంగా వెలుతురు ఎరను పంపిణీ చేశారు. కేంద్ర పభుత్వం ఉచితంగా అందజేసిన వెలుతురు ఎరలను 60 మంది రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొత్తూరు బాబు మాట్లాడుతూ మామిడి పంటకు కీడు చేసే రెక్కల పురుగులు, ఇతర క్రిమి కీటకాలు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు వస్తాయన్నారు. అవి వెలుతురు ఎరల ఆకర్షణకు గురై కింద ఉన్న నీళ్లలో పడిపోతాయని వివరించారు. నీళ్లలో క్రిమిసంహారకమందును కలిపి ఉంచడం ద్వారా నీళ్లలో పడిన పురుగులు అక్కడకక్కడే మరణిస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఆడ పురుగులు మృతి చెందడం కారణంగా వాటి ఉత్పత్తి తగ్గి భవిష్యత్తులో రైతుకు నష్టం జరగదని పేర్కొన్నారు. సూర్య శక్తితో పని చేసేవెలుతురు ఎర రాత్రి పది గంటల తర్వాత ఆటోమేటిక్ గా ఆగిపోతుందన్నారు. తర్వాత వచ్చే పురుగుల కారణంగా మామిడికి మేలు జరుగుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వీటిని ఉచితంగా రైతులకు ఉచితంగా అందజేసిందని ఎకరాకు రెండు నుంచి మూడు వెలుతురు ఎరలను వాడడం కారణంగా చీడపీడలను నివారించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్కటి పంపిణీ చేస్తున్నామని, మార్కెట్లో దీన్ని విలువ వెయ్యి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు ఇలాంటివి మరిన్ని కొని పొలంలో ఉంచడం కారణంగా మామిడి ఉత్పత్తి పెరుగి, నాణ్యత వస్తుందని వివరించారు. జిల్లాలో చిత్తూరు, శ్రీకాళహస్తి మండలాల్లో ఇలాంటి రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అని తెలిపారు.
మూడు సంవత్సరాలు పాటు ఈ ఉత్పత్తిదారులకు కంపెనీకి ఫర్నిచర్, శిక్షణ, కార్యాలయ నిర్వహణ ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఒకసారి వెయ్యి రూపాయలు వాటా ధనంగా చెల్లిస్తే జీవితాంతం సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ చంద్ర నాయుడు, వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా కో-ఆర్డినేటర్ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.