చిత్తూరు గంగ జాతర ఒక అద్భుతం
చిత్తూరు గంగ జాతర ఒక అద్భుతం
చిత్తూరు గంగ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. బజారు వీధిలోని నడివీధి గంగమ్మను ప్రతిష్ట చేస్తారు. గంగమ్మ బంగారు నగలతో దేదిప్యమానంగా వెలుగొందుతుంది. విద్యుత్తు కాంతి వెలుగులలలో అమ్మ వారి ప్రకాశం వర్ణింప అలవికాదు. ఇందుకు అనుగుణంగా సంతపేట, గిరింపేట, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, మురకంబట్టు, మంగసముద్రం, మంగసముద్రం హౌసింగ్ కాలనీ, ఓబనపల్లిలో కూడా గంగమ్మలు కొలువు తీరుతాయి. పది చోట్ల అనుబంధంగా గంగమ్మలను కొలువు తీర్చి, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు గంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
జాతరకు మే నెల 9వ తేదీన చాటింపు వేశారు. చాటింపు వేసిన తర్వాత చిత్తూరులోని పుర ప్రజలు ఎవరు బయటకు వెళ్లి నిద్ర చేయకూడదని ఆచారం. ఎక్కడికి వెళ్ళినా రాత్రి తిరిగి చిత్తూరుకు చేరుకోవాలని పెద్దలు చెప్తారు. జాతర సందర్భంగా పొన్నెమ్మ గుడిలోని పొన్నెమ్మకు, తేనె బండ లోని ముత్యాలమ్మ వారికి భక్తులు పొంగళ్ళు పెట్టి, నైవేద్యం సమర్పిస్తారు. ఇందుకు ఆలయ ధర్మకర్తలు ఏర్పాటు చేస్తారు. 16వ తేదీన సీకే బాబు తెర తొలగించి, తొలి పూజ చేసిన తర్వాత అమ్మవారి దర్శనం ప్రారంభం అవుతుంది.
అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు రెండు రోజులు సమయం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో విచిత్ర వేష ధారణతో మొక్కులు సమర్పించుకొని, కానుకలు హుడిలో వేస్తారు. 17వ తేదీ సాయంకాలం పన్నెమ్మ గుడి నుంచి ఆలయ ధర్మకర్త సీకే బాబు అమ్మవారికి సారెను తీసుకుని వెళ్తారు. అమ్మవారికి సారెను సమర్పించి, చిత్తూరు ప్రజలను సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఆఖరు సరిగా అమ్మవారికి హారతి ఇస్తారు. అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
బజారు వీధిలో అమ్మవారు నిమజ్జనానికి కదలగా, చర్చి వీధిలో ఓం శక్తి భక్తుల విన్యాసాలను ఆలయ ధర్మకర్త సీకే బాబు ప్రారంభిస్తారు. ఓం శక్తి భక్తులు నాలుకకు, దవడలకు, శరీరం మీద చూలాలను గుచ్చుకొని, నిమ్మకాయలను వేలాడదీసుకుంటారు. వీపు వెనుక వైపు కొక్కిళ్లు తగిలించుకుని ఆటోలు, జీవులు, కార్లు, లారీలు లాగుతారు. భక్తి శ్రద్ధలతో జరిగే ఓం శక్తి భక్తుల విన్యాసాలు గంగ జాతరలో ప్రత్యేక ఆకర్షణ. ఓం శక్తి విన్యాసాలను చూడడానికి ప్రజలు భారీగా భక్తులు తరలివస్తారు.బజారు వీధి నుండి నిమజ్జనానికి బయలుదేరిన గంగమ్మకు బజారి వీధిలోని భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కాయ, కర్పూరం సమర్పించుకుంటారు. వీధి మొత్తం పూల వాన కురుస్తుంది. భక్తులకు అన్న ప్రసాదం, శీతల పానీయాలను అందచేస్తారు. భక్తులకు వీడ్కోలు చెబుతూ అమ్మవారు మందగమనంతో చందన రమేష్ సెంటర్ చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో భారీగా బాణసంచా పేలుస్తారు. ప్రజలు భారీగా పాల్గొంటారు.
బయలుదేరిన ఓం శక్తి భక్తుల విన్యాసాలు చర్చి వీధి పన్నెమ్మ గుడి వీధి హాయ్ రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం మీదుగా చందన రమేష్ కార్నర్ చేరుకుంటుంది. అక్కడ పీకే బాబు అమ్మవారికి హారతినిస్తారు. ఓం శక్తి భక్తులు వారికి పూలమాలవేసి వీడ్కోలు పలకడంతో గంగ జాతర ముగుస్తుంది. అనంతరం అమ్మవారిని కట్టమంచి చెరువులో నిమర్జ్జనం చేస్తారు. ఈ సందర్భంగా చందన రమేష్ కార్నర్లో ఆర్కెస్ట్రాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది.
17 తారీకు చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. భారీగా బంధుమిత్రులు చిత్తూరుకు తరలి వస్తారు. 16వ తేదీన అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడంతోపాటు బలులు కూడా సమర్పించుకుంటారు. ఈ జాతరకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అడుగడుగునా నిఘా ఉంటుంది. గంగమ్మను ప్రతిష్టించినప్పటి నుంచి నిమర్జ్జనం వరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తారు.