17, మే 2023, బుధవారం

పుంగనూరు పులికి ఎదురెళ్ళేది ఎవరు ?

 పుంగనూరు పులికి ఎదురెళ్ళేది ఎవరు ? 


                         ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎదురు లేని నాయకునిగా చక్రం తిప్పుతున్నారు. ఈ సారి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడిస్తానని సవాలు విసురుతున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలలో వైసిపి అభ్యర్ధులు గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. గత స్తానిక  సంస్థల ఎన్నికలు,  ఎంపిపి, జెడ్పీటీసీలతో పాటు  కుప్పం మునిసిపాలిటీని వైసిపి ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబును దెబ్బతీయడానికి అనువుగా వన్నె రెడ్డి వర్గానికి చెందిన భరత్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అలాగే ఇటీవల అదే వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యాన్ని  ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయనను పిలిచి పదవి ఇచ్చారు. 




                 పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరు సార్లు MLA గా గెలుపొందారు. 1999 నుండి వరుసగా అయిదు సార్లు MLAగా ఎన్నికై రికార్డు సృష్టించారు. పీలేరు నుండి మూడు సార్లు, పుంగనూరు నుండి మరో మూడు సార్లు MLAగా ఎన్నికయ్యారు. 1974 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా, 1985, 1994 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 1999, 2004 లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2009 లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరంలో YS  రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి  రోశయ్య మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 2013లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 , 2019లో YSR కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆయన 2019లో YS జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది.


  

                         కుప్పంలో వన్నె రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 35 వేలకు పైగా ఉన్నందున వారిని ఆకర్షించడానికి ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి దశ నుంచి తనకు వ్యతిరేకి అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని పుంగనూరులో కట్టడి చేయాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అందుకే రాజకీయ నేపథ్యం ఉన్న చల్లా రామచంద్రా రెడ్డిని పుంగనూరు ఇంచార్జిగా నియమించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయనకు ముందు ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రి ఎన్ అమరనాధ రెడ్డి  మరదలు అనీషా రెడ్డి పనితీరు నచ్చక చల్లాకు అవకాశం కల్పించారు. 


              అయితే పెద్దిరెడ్డి చరిత్ర, నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే ఆయనను ఎదుర్కోవడం అంత సులభం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నియోజక వర్గాల పునర్విభజన తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎం వెంకట్రామ రాజు పై 31,737 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ అభర్థి ఖాదర్ బాషాకు 25,891 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి వెంకట్రామరాజుపై 31,731 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి వైసిపి టిక్కెట్ పై పోటీ చేసి టిడిపి అభ్యర్ధి ఎన్ అనీషా రెడ్డిపై 42,710 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి బొడే రామచంద్ర యాదవ్ కు 16,452 ఓట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి గతంలో మూడు సార్లు పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఇప్పుడు  జగన్ మంత్రి వర్గంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. తన కుమారుడు మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపిగా, తమ్ముడు ద్వారకనాధ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. 




                 రొంపిచర్లకు చెందిన చల్లా  రామచంద్రా రెడ్డి 1989 లో పీలేరులో TDP అభ్యర్థిగా పోటి చేసి, పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయన తండ్రి  1985 చల్లా ప్రభాకర్ రెడ్డి పీలేరు నుండి TDP అభ్యర్థిగా పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించారు. తాత CK నారాయణ రెడ్డి కూడా పీలేరు MLAగా పనిచేశారు. మరో తాత TTD పేష్కర్  గా పనిచేశారు. చల్లా  రామచంద్రా రెడ్డి కూడా TTD పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. కుటుంబ సభ్యులు, ఆయన  రొంపిచెర్ల MPP, Z P T C గా పనిశారు. రాజకీయ నేపధ్యం ఉన్న చల్లా  రామచంద్రా రెడ్డిని ఈ పర్యాయం TDP  పుంగనూరులో పోటికి దించనుంది. 



                        ఇదిలా ఉండగా టిడిపిలో వర్గ పోరు, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. మాజీ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ అమరనాధ రెడ్డి వర్గం, చల్లా బాబుతో కలసి పనిచేయడం లేదు. గతంలో TDP అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణ రాజు, ఆయన సోదరుడు YCPలో చేరారు. కార్యకర్తలు మాత్రం టీడీపీ తోనే ఉన్నారు. ప్రతి మండలంలో వర్గ పోరు కనిపిస్తున్నది. సగం మండలాలకు కమిటీలు కూడా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డిని ఇక్కడ పరిశీలకునిగా నియమించారు. ఆయన ఇప్పటి వరకు ఒక సారి కూడా నియోజక వర్గ కేంద్రమైన పుంగనూరుకు రాలేదని ఒక నాయకుడు చెప్పారు. అలాగే ఇతర మండలాలలో పర్యటించి కార్యకర్తలను సమన్వయ పరచడం పట్ల ఆయన శ్రద్ద చూపడం లేదని అంటున్నారు. 



          2019  ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటి చేసిన బొడే రామచంద్ర యాదవ్ కు 16,452 ఓట్లు వచ్చాయి. తర్వాత BJPకి దగ్గర అయ్యారు. రామచంద్రా రెడ్డికి చెందిన శివశక్తి డైయిరీలో అవకతవకలు జరుతున్నాయని, రైతులను సమీకరించి అందోళనకు సిద్దం అవుతుండగా యాదవ్ మీద, ఇంటి మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడి  చేశారు. దీంతో యాదవ్ డిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ను కలిచారు. ప్రభుత్యం యాదవ్ కు Y+ కేటగిరీ రక్షణ కల్పించింది. అయన బాబా రాందేవ్ అనుచరుడు. యాదవ్ గృహ ప్రవేశానికి కూడా బాబా రాందేవ్ హాజరయ్యారు. యాదవ్ రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా పుంగనూరులో పోరాటం చేస్తున్నారు.   

 



                         ఈ నేపథ్యంలో బోడే రామచంద్ర యాదవ్ కు టిడిపి టిక్కెట్టు ఇస్తే మంచిదనే ప్రచారం ఊపందుకుంది. ఆయన గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి చెప్పుకోదగ్గ ఓట్లు సాధించారు. ఆర్థికంగా బలమైన ఆయన తొలి నుంచి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఆయనకు జిల్లాకు చెందిన ఇద్దరు బలమైన టిడిపి నాయకుల మద్దతు ఉందంటున్నారు. ఆయన కూడా త్వరలో టిడిపిలో చేరి టిక్కెట్టు తెచ్చుకుంటానని కలసిన వారితో చెపుతున్నారు. అయితే ఎవరు పోటీ చేసినా పెద్దిరెడ్డిపై గెలవడం అంత సులభం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. పెద్దిరెడ్డి ఎన్నికల వ్యూహం అలా ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ లో ఆయనకు సాటి ఎవరూ లేరు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *