తిరిగి TDP గూటికి SCV నాయుడు
తిరిగి TDP గూటికి SCV నాయుడు
మారనున్న తిరుపతి పార్లమెంట్ రాజకీయ ముఖచిత్రం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు తెలుగు దేశం పార్టీకి చేరువవుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు శాసనమండలి సభ్యత్వం ఇస్తానని హామీ ఇచ్చి, మాట తప్పడంతో ఎస్ సి వి నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సారి ఎన్నికలలో పోటీ చేయాల్సిందిగా నాయుడు అనుచరులు ఆయన మీద ఒత్తిడి తీస్తున్నారు. కావున ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో చేరి టిక్కెట్టు కోసం నాయుడు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలవడం ఇందుకు బలం చేకూర్చుతుంది. SCV నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరితే తిరుపతి పార్లమెంట్ ముఖచిత్రం మారనుంది. రాజకీయంగా పెను మార్పుల చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరితే పార్లమెంటు నాయకత్వ భాధ్యతలను కూడా అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. SCV నాయుడు పార్టీలో చేరితే ఆ ప్రభావం శ్రీకాళహస్తి నియోజకవర్గం మీదే కాకుండా సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల మీద కూడా ఉంటుందని భావిస్తున్నారు. నాయుడు కారణంగా మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధి అంటే తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మూడు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు నియోజకవర్గాలను SCలకు రిజర్వ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి ప్రస్తుతం కమ్మ సమాజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఇన్చార్జిగా ఉన్నారు. అయితే అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన మస్తాన్ యాదవ్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన మహానాడు నిర్వహణకు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని పార్టీకి అందజేశారు. ఇందుకు చంద్రబాబు నాయుడు ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. మస్తాన్ యాదవ్ కుజిల్లా పరిశీలకులు బీద రవిచంద్ర యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవులు మద్దతుగా ఉన్నారు. ఆయనకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లాలో యాదవులు బలమైన సామాజిక వర్గం కావడంతో వెంకటగిరి లేదా తిరుపతి నియోజకవర్గాన్ని యాదవులకు కేటాయించాల్సిందిగా పార్టీ మీద వత్తిడి తెస్తున్నారు. BC కోటలో తుడా మాజీ చైర్మన్, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ టిక్కెట్టు బరిలో ఉన్నారు. ఇక తిరుపతి విషయానికి వస్తే బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు టికెట్టు దాదాపు ఖరారు అని ప్రచారం జరుగుతోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మాజీ మంత్రి, స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ యువగళం పాదయాత్రలో ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో సర్వేపల్లిని రెడ్డి సామాజిక వర్గానికి, వెంకటగిరిని బీసీ సామాజిక వర్గానికి, తిరుపతిని బలిజ సామాజిక వర్గానికి కేటాయించే పక్షంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే SCV నాయుడుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎస్ సి వి నాయుడు ప్రజల మనిషిగా మన్ననలు పొందారు. అన్ని వర్గాలతో కలుపుగోలుగా ఉండే వ్యాపారవేత్త. అందుబాటులో ఉంటూ తన వద్దకు వచ్చిన వారికి సహాయం అందజేస్తున్నారు. అయన పార్టీలో చేరితే శ్రీకాళహస్తి కాకుండా సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా పార్టీకి బలం చేకూరుతుందని భావిస్తున్నారు. సర్వేపల్లి లో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి, కాళహస్తిలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్టు ఇస్తే కమ్మ సామాజిక వర్గానికి జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. కావున వెంకటగిరి నుంచి కానీ, శ్రీకాళహస్తి నుంచి గానీ కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వేంకటగిరి ఇంచార్జ్ రామకృష్ణకు టిక్కెట్టు ఖరారు చేస్తే, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డికి అవకాశం రావచ్చు. అలాకాకుండా వెంకటగిరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులకు టికెట్ కేటాయిస్తే శ్రీకాళహస్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన SCV నాయడుకు టిక్కెట్టు లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీకాళహస్తికి చెందిన SCV నాయుడు 2004 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009 ఎన్నికల్లో కూడా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీనితో కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలో చేరి, సత్యవేడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పనిచేసారు. 2014 ఎన్నికలలో ఆయన శ్రీకాళహస్తి టిడిపి టికెట్ ను ఆశించారు. టిడిపి టిక్కెట్టు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి దక్కింది. కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్న SCV నాయుడు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే MLC ఇస్తామని పార్టీ అధినేత జగన్, జిల్లా మంత్రి రామచంద్రారెడ్డి ఎస్ సి వి నాయుడుకు హామీ ఇచ్చారు. ఎస్ సి వి నాయుడు పార్టీ కోసం పనిచేస్తున్నా, చివరి నిమిషంలో ఎమ్మెల్సీగా సిపాయి సుబ్రహ్మణ్యంకు ఇచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి YCPలో చేరిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఇవ్వడం SCV అనుచరులకు మింగుడు పడటం లేదు. ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో నాయుడు YCP పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు టిడిపి ఇన్ ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. నాలుగు రోజుల కిందట TDP పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన SCV నాయుడు తన మనసులోని మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ముందు పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు SCV నాయుడుకు సూచించినట్లు తెలుస్తోంది. SCV నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరితే మూడు నియోజక వర్గాల్లో పార్టీ పటిష్టమవుతుందని, పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకత్వం లభిస్తుందని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాయుడు కూడా ఆ దిశలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా వత్తిడి చేస్తున్నారు. తొందరలోనే SCV నాయుడు TDPలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. SCV నాయుడు, బొజ్జల సూదీర్ రెడ్డిలలో ఒకరికి MLA టిక్కెట్టు, మరొకరికి MLC ఇస్తే నియోజక వర్గంలో TDPకి తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.