4, అక్టోబర్ 2026, ఆదివారం

కుప్పంలో అక్రమార్కులపై ఉక్కుపాదం

గంగ 3 కుప్పం అదనపు ఎస్పీ హేమంత్‌ బొడ్డు


కుప్పంలో అక్రమార్కులపై ఉక్కుపాదం

అక్రమ రవాణాకు కళ్లెం.. నేరాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసింగ్‌

కుప్పం ఏఎస్పీగా ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ బొడ్డు నియామకం

మూడు రాష్ట్రాల సరిహద్దులో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా

ఎర్రచందనం, గ్రానైట్‌, రేషన్‌ బియ్యం, మద్యం అక్రమ రవాణాపై దృష్టి

గత పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు ఐపీఎస్ అధికారి నియామకం


చిత్తూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రప్రభ బ్యూరో): కుప్పం నియోజకవర్గంలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, మూడు రాష్ట్రాల సరిహద్దుల నుంచి సాగుతున్న అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు ఐపీఎస్‌ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కుప్పం ఏఎస్పీగా హేమంత్‌ బొడ్డును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చింతూరు ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయనను కుప్పానికి బదిలీ చేసింది. కుప్పం సబ్‌ డివిజన్‌ డీఎస్పీగా పనిచేస్తున్న బి. పార్థసారథిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో కుప్పం నియోజకవర్గం ఉండటంతో ఇక్కడ నేర నియంత్రణ పోలీసులకు ప్రత్యేక సవాల్‌గా మారింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులభంగా వెళ్లేందుకు అనేక మార్గాలు ఉండటంతో అక్రమ రవాణాదారులు, నేరగాళ్లు సరిహద్దు ప్రాంతాలను అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన ఏఎస్పీ ఆధ్వర్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం మీదుగా ఎర్రచందనం, గ్రానైట్‌, రేషన్‌ బియ్యం, మద్యం తదితరాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తరచూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు నుంచి మద్యం అక్రమంగా తరలించడం, ఏపీలోని రేషన్‌ బియ్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలించడం వంటి వ్యవహారాలపై ఇప్పటికే సంబంధిత శాఖలు కేసులు నమోదు చేస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, గ్రామీణ రహదారులు, అంతర్రాష్ట్ర అనుసంధాన మార్గాలను అక్రమార్కులు వినియోగించే అవకాశం ఉండటంతో పోలీసు నిఘా కీలకంగా మారింది. అదేవిధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, వాహనాల చోరీలు, ఇళ్ల దొంగతనాలు వంటి నేరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేరాలకు పాల్పడిన అనంతరం సరిహద్దులు దాటి తప్పించుకునే అవకాశాన్ని నేరగాళ్లు ఉపయోగించుకోకుండా మూడు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం పెంచాలని భావిస్తున్నారు. సరిహద్దు చెక్‌పోస్టులతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ ఆకస్మిక తనిఖీలు, వాహనాల తనిఖీలు, అనుమానితుల కదలికలపై నిఘా పెంచే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గంలో మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపైనా పోలీసుల దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లోని తోటలు, నిర్మానుష్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాల అంచులను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త పోలీసింగ్‌ వ్యవస్థను రూపొందించనున్నారు. కుప్పం రాజకీయంగా అత్యంత కీలకమైన నియోజకవర్గం కావడంతో ఎన్నికలు, రాజకీయ కార్యక్రమాల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కూడా పోలీసులకు ముఖ్యమైన బాధ్యతగా మారుతోంది. వర్గ విభేదాలు, పరస్పర ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు నిఘా, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాల మోహరింపుపై కూడా దృష్టి పెట్టనున్నారు. కుప్పం నియోజకవర్గంలో నేరాల పరిస్థితి, అక్రమ రవాణాపై ఇటీవల రాష్ట్ర హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అవసరమైతే నియోజకవర్గానికి అదనపు ఎస్పీని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐపీఎస్‌ అధికారిని ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఏఎస్పీ నియామకంతో కుప్పం పోలీసు వ్యవస్థకు అదనపు బలం చేకూరనుంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నేరాలు, అక్రమ రవాణా, మత్తు పదార్థాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణపై ఐపీఎస్‌ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండనుంది. మూడు రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం పెంచడం, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, అక్రమ మార్గాలను గుర్తించడం ద్వారా అక్రమార్కులకు చెక్‌ పెట్టే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గంలో అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో కళ్లెం వేసి, నేరాలను నియంత్రించి ప్రజలకు మరింత భద్రత కల్పించడమే కొత్త పోలీసింగ్‌ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కుప్పంలో అక్రమార్కుల ఆటలకు బ్రేక్‌ పడుతుందా, నేరాల నియంత్రణలో పోలీసు యంత్రాంగం ఎంత మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *