4, అక్టోబర్ 2026, ఆదివారం

రూ.10 లక్షల రుణం ఆశ చూపి.. జనసైనికులకు కుచ్చుటోపీ!

రూ.10 లక్షల రుణం ఆశ చూపి.. జనసైనికులకు కుచ్చుటోపీ!

ఫైనాన్స్‌ అదనపు కార్యదర్శి పేరుతో వల.. 

రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో లక్షలు వసూలు

నేడు.. రేపంటూ కాలయాపన.. చివరకు ఫోన్లు స్విచ్‌ఆఫ్‌

కలెక్టర్‌కు ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం.. 

పోలీసుల దర్యాప్తులో మరిన్ని బాధితులు


రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో రూ.2,100 చొప్పున వసూళ్లు

గంగాధర నెల్లూరులోనే సుమారు రూ.3 లక్షలు చెల్లించినట్లు వెల్లడి

పీలేరు, తిరుపతి, పూతలపట్టు నియోజకవర్గాల్లోనూ బాధితులు

అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకున్న వ్యక్తిపై పోలీసుల ఆరా


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

జనసేనలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.10 లక్షల రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి.. రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేసి.. చివరకు ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసుకున్న వ్యవహారం చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి, తనతో పాటు మరో మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని కోరినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో పలువురు జనసైనికులు డబ్బులు చెల్లించి మోసపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

సుమారు పది నెలల కిందట గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి, ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పొన్నా యుగంధర్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన పేరు పోలంకి లక్ష్మన్ అని, రాష్ట్ర ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనతో మాట్లాడాలని చెప్పారని, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన కోసం యుగంధర్‌ బాగా పనిచేస్తున్నారని మంత్రి తనకు చెప్పారని పేర్కొన్నాడు. జనసైనికులకు ఆర్థికంగా చేయూత అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణాలు ఇప్పిస్తున్నామని నమ్మబలికినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ముందుగా రూ.2,100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ మొత్తాన్ని పోస్టాఫీసులో గానీ, ఫోన్‌పే ద్వారా గానీ చెల్లించాలని సూచించాడు. రుణం మంజూరైన తర్వాత ప్రతి నెలా రూ.2,100 చొప్పున ఈఎంఐగా పోస్టాఫీసు ద్వారా చెల్లించాల్సి ఉంటుందని వివరించాడు. మాటల్లో నమ్మకం కలిగించేందుకు జిల్లాలోని పలువురు జనసేన నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు యుగంధర్‌ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. జిల్లాలోని అనేక మంది నాయకులతో తాను మాట్లాడుతున్నానని, జనసైనికులకు ఈ ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పడంతో విషయం నిజమేనని యుగంధర్‌ నమ్మినట్లు సమాచారం. దీంతో ఆయన నియోజకవర్గంలోని జనసైనికులకు ఈ విషయం తెలియజేశారు. రుణం వస్తుందన్న ఆశతో పలువురు రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించారు. ఈ క్రమంలో కొండ యుగంధర్‌ ద్వారా సుమారు రూ.3 లక్షలు పోలంకి లక్ష్మన్, కొల్లా రాధిక పేర్లపై పంపినట్లు పోలీసులకు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. అయితే కొంతకాలం తర్వాత అసలు కథ మొదలైంది. రుణం ఎప్పుడు వస్తుందని అడిగితే నేడు.. రేపు.. అంటూ వాయిదా వేస్తూ వచ్చారని బాధితులు చెబుతున్నారు. రోజులు గడుస్తున్నా రుణం రాకపోవడంతో అనుమానం మొదలైంది. చివరకు సంబంధిత వ్యక్తులకు ఫోన్‌ చేయగా నంబర్లు స్విచ్‌ఆఫ్‌ రావడంతో జనసైనికులు ఆందోళనకు గురయ్యారు. తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి స్వాహా చేశారంటూ కొంతమంది జనసైనికులు జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్ ను ఆశ్రయించారు. పొన్నా యుగంధర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆ ఫిర్యాదును జిల్లా ఎస్పీకి పంపించి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొండ యుగంధర్‌ పోలీసుల ఎదుట తన వాదన వినిపించినట్లు తెలిసింది. తాను ఎవరి వద్ద నుంచి ఎంత మొత్తం తీసుకున్నది, ఆ మొత్తాన్ని ఎవరికి, ఎప్పుడు పంపింది అనే వివరాలతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. తనను పోలంకి లక్ష్మన్న మోసం చేశాడని, అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని యుగంధర్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంగాధర నెల్లూరుతో పాటు పీలేరు, తిరుపతి నియోజకవర్గాల్లోనూ పలువురు జనసైనికులు ఇదే విధంగా డబ్బులు చెల్లించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలంలోనూ కొందరు రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో మోసానికి పాల్పడిన ముఠా ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తమను ఆర్థిక శాఖ అధికారులుగా పరిచయం చేసుకోవడం, ప్రముఖుల పేర్లు ప్రస్తావించడం, ప్రభుత్వ పథకం పేరుతో భారీ రుణాల ఆశ చూపడం, ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయడం వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలంకి లక్ష్మన్, కొల్లా రాధికకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు స్విచ్‌ఆఫ్‌ రావడంతో వారి చిరునామాలు, లావాదేవీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రుణాల పేరుతో ఎంతమంది నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. దర్యాప్తు పూర్తయితే ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *