సర్వర్ మొరాయింపు.. రేషన్ సరఫరాకు బ్రేక్!
సర్వర్ మొరాయింపు.. రేషన్ సరఫరాకు బ్రేక్!
క్యూఆర్ కోడ్ విధానంతో సాంకేతిక సమస్యలు..
నాలుగు రోజులుగా రేషన్ షాపుల చుట్టూ కార్డుదారులు
పట్టణాలు, పల్లెల్లో ఒకటే పరిస్థితి.. డీలర్లతో వాగ్వాదాలు
కొత్త విధానంతో ఒక్కసారిగా పెరిగిన సర్వర్‌పై భారం
76 శాతం సరఫరా పూర్తయిందంటున్న అధికారులు
క్యూఆర్ కోడ్ దెబ్బకు రేషన్ పంపిణీ అతలాకుతలం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
పేదల కడుపు నింపాల్సిన రేషన్ వ్యవస్థ సాంకేతిక చిక్కుల్లో చిక్కుకుంది. ప్రభుత్వం ఈ నెల నుంచి కొత్తగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ విధానం రేషన్ డీలర్లకు, కార్డుదారులకు తలనొప్పిగా మారింది. క్యూఆర్ కోడ్ ద్వారా బియ్యం సంచుల వివరాలను నమోదు చేసే సమయంలో సర్వర్ మొరాయించడంతో జిల్లాలోని అనేక రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ నిలిచిపోయింది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో కార్డుదారులు ప్రతిరోజూ రేషన్ షాపుల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారులు మాత్రం సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని చెబుతున్నారు. నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కార్డుదారులు అనునిత్యం రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొందరు రేషన్ షాప్ డీలర్లతో వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఎంత వివరించిన కార్డుదారులు వినకపోవడంతో డీలర్లు విసిగిపోతున్నారు.
చిత్తూరు జిల్లాలో 1,220 రేషన్ షాపులు ఉండగా, మొత్తం 4,50,823 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 3,321 అంత్యోదయ కార్డులు, 4,47,502 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు ప్రతి నెలా సుమారు 8,210 మెట్రిక్ టన్నుల బియ్యం, 257 మెట్రిక్ టన్నుల చక్కెరతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సాధారణంగా నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీలోపు రేషన్ పంపిణీ పూర్తవుతుంది. అయితే అక్టోబర్ నెలలో కొత్త విధానం అమల్లోకి రావడంతో అనేక ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ మందగించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీకి సంబంధించి అమలులో ఉన్న విధానానికి అదనంగా క్యూఆర్ కోడ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డీలర్లు ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత కోడ్‌ను నమోదు చేసిన తరువాత స్కానర్ ద్వారా బియ్యం సంచులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. ఒక్కోసారి 10 బియ్యం సంచులకు సంబంధించిన వివరాలను మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తరువాతే బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయాలి. ఆ 10 సంచులు పూర్తయితే మళ్లీ తదుపరి 10 సంచుల వివరాలను స్కాన్ చేసి పంపిణీ కొనసాగించాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సర్వర్‌పై భారీఎత్తున సమాచారం నమోదవుతుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు డీలర్లు చెబుతున్నారు. గతంలో ఒకేసారి జరిగే పంపిణీ ప్రక్రియకు ఇప్పుడు ప్రతి విడత బియ్యం సంచుల వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయాల్సి రావడంతో సర్వర్‌పై భారం పెరిగిందని అంటున్నారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అనేక రేషన్ షాపుల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ నిలిచిపోతోంది. రేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియక కార్డుదారులు ప్రతిరోజూ దుకాణాల వద్దకు వస్తున్నారు. ఉదయం నుంచి వేచి చూసి చివరకు సర్వర్ పనిచేయడం లేదని తెలిసి వెనుదిరగాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ పనులు వదిలి రేషన్ కోసం రావాల్సి వస్తోందని, ఒక్కరోజు సమస్య అనుకుంటే నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెబుతున్నారు. మరికొందరు డీలర్లు ఉద్దేశపూర్వకంగా సరుకులు ఇవ్వడం లేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో డీలర్లు, కార్డుదారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. సర్వర్ సమస్య తమ పరిధిలో లేదని డీలర్లు చెబుతున్నారు. అధికారులు ఈరోజు, రేపు సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారని, అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్డుదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు వాపోతున్నారు. కొత్త విధానాన్ని అమలు చేసే ముందు సర్వర్ సామర్థ్యాన్ని పెంచి, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండేదని పలువురు డీలర్లు అభిప్రాయపడుతున్నారు.
డీఎస్ఓ వివరణ
ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరాయుడును ఆంధ్రప్రభ ప్రశ్నించగా.. ప్రభుత్వం ఈ నెల నుంచి క్యూఆర్ కోడ్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. కొత్త విధానం ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ఇంజనీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 76 శాతం నిత్యావసర వస్తువుల పంపిణీ పూర్తయిందని, మిగిలిన కార్డుదారులందరికీ త్వరలోనే సరుకులు అందజేస్తామని స్పష్టం చేశారు. పారదర్శకత, అక్రమాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానం లక్ష్యం మంచిదే అయినా.. అమలులో సాంకేతిక లోపాలు పేదలకు ఇబ్బందిగా మారకూడదు. నెల ప్రారంభంలోనే అందాల్సిన రేషన్ కోసం రోజుల తరబడి దుకాణాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ముఖ్యంగా 4.50 లక్షలకు పైగా కార్డుదారులున్న జిల్లాలో సర్వర్ సామర్థ్యాన్ని తక్షణమే పెంచి, నిలిచిపోయిన పంపిణీని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే పారదర్శకత కోసం తెచ్చిన కొత్త విధానం ప్రజలకు మాత్రం కొత్త తిప్పలు తెచ్చినట్లవుతుంది.

