కరువు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలే దిక్కు!
కరువు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలే దిక్కు!
80 శాతం సబ్సిడీపై ఉలవలు, ఉద్దుల విత్తనాలు
జిల్లాకు 5,336 క్వింటాళ్ల ఉలవలు.. 215 క్వింటాళ్ల ఉద్దులు మంజూరు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలే దిక్కుగా మారుతున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణంలో ఏకంగా 61 శాతం భూమి సాగుకు నోచుకోకపోవడంతో ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగు చేసుకునే పంటలను వేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధాన పంటలైన వేరుశనగ, రాగి, కంది, ఉలవల సాగు గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వం ఉలవలు, ఉద్దుల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కరువు పరిస్థితుల్లో రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, సాధ్యమైన మేరకు భూములను సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. జిల్లాలో సాధారణంగా 44,268 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు కావాల్సి ఉండగా, అక్టోబర్ 1 నాటికి కేవలం 17,381 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో 39 శాతం మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. మరో 26,887 హెక్టార్లలో, అంటే 61 శాతం భూమిలో సాగు జరగలేదు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో విత్తనాలు వేసేందుకు రైతులు వెనుకంజ వేయగా, ఇప్పటికే వేసిన కొన్ని పంటలు కూడా వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న వేరుశనగ సాగు అత్యంత దారుణంగా పడిపోయింది. సాధారణంగా 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 4,728 హెక్టార్లలో మాత్రమే సాగైంది. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో వేరుశనగ 22 శాతానికే పరిమితమైంది. వేరుశనగపై ఆధారపడే రైతుల సంఖ్య అధికంగా ఉండటంతో సాగు తగ్గడం వారి ఆదాయంపై కూడా ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. వర్షాధార పంటల్లో కీలకమైన రాగి సాగు కూడా భారీగా తగ్గింది. సాధారణంగా 1,779 హెక్టార్లలో రాగి సాగు కావాల్సి ఉండగా, 514 హెక్టార్లలోనే సాగై 29 శాతానికి పరిమితమైంది. కంది సాధారణ విస్తీర్ణం 1,495 హెక్టార్లు కాగా కేవలం 128 హెక్టార్లలో సాగై 9 శాతానికే చేరింది. ఉలవల సాధారణ సాగు విస్తీర్ణం 1,385 హెక్టార్లు కాగా 32 హెక్టార్లలో మాత్రమే సాగై 2 శాతానికి పరిమితమైంది. సామలు 125 హెక్టార్లకు గాను 9 హెక్టార్లలో సాగై 7 శాతం, అలసందలు 303 హెక్టార్లకు గాను 36 హెక్టార్లలో సాగై 12 శాతంగా నమోదయ్యాయి. ఆహార ధాన్యాల సాగులో వరి కొంత మెరుగైన స్థితిలో ఉంది. సాధారణంగా 9,068 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా, 5,412 హెక్టార్లలో సాగై 60 శాతం నమోదైంది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 492 హెక్టార్లు కాగా, 322 హెక్టార్లలో సాగై 65 శాతానికి చేరింది. సజ్జ 656 హెక్టార్లకు గాను 344 హెక్టార్లలో సాగై 53 శాతం నమోదైంది. జొన్న 59 హెక్టార్లకు గాను 22 హెక్టార్లలోనే సాగై 38 శాతానికి పరిమితమైంది. వాణిజ్య పంటల్లో చెరకు మాత్రం 86 శాతం సాగుతో కొంత మెరుగైన పరిస్థితిలో ఉంది. సాధారణంగా 6,559 హెక్టార్లలో చెరకు సాగు కావాల్సి ఉండగా, 5,656 హెక్టార్లలో సాగైంది. అయితే జిల్లాలో మొత్తం ఖరీఫ్ సాగు పరిస్థితిని పరిశీలిస్తే ప్రధానంగా వర్షాధార పంటలే తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రధాన పంటల సాగు తగ్గడంతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జిల్లాకు 5,336 క్వింటాళ్ల ఉలవల విత్తనాలను మంజూరు చేసింది. అక్టోబర్ 5 నాటికి 3,953.2 క్వింటాళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 215 క్వింటాళ్ల ఉద్దుల విత్తనాలు మంజూరు కాగా, 170 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఉలవల విత్తనాల పూర్తి ధర కిలోకు రూ.74 కాగా, ప్రభుత్వం 80 శాతం సబ్సిడీగా రూ.59.20 భరిస్తోంది. దీంతో రైతులు కిలో ఉలవల విత్తనాలను కేవలం రూ.14.80కే పొందవచ్చు. ఉద్దుల విత్తనాల పూర్తి ధర కిలోకు రూ.129.50 కాగా, ప్రభుత్వం రూ.103.60 సబ్సిడీ ఇస్తోంది. దీంతో రైతులకు కిలో ఉద్దుల విత్తనాలు రూ.25.90కే లభించనున్నాయి. డివిజన్ల వారీగా చూస్తే పలమనేరు డివిజన్‌కు అత్యధికంగా 3,299 క్వింటాళ్ల ఉలవలు కేటాయించారు. అక్టోబర్ 5 నాటికి 2,622.8 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు డివిజన్‌కు 1,760 క్వింటాళ్లు కేటాయించగా 1,170.4 క్వింటాళ్లు అందుబాటులోకి వచ్చాయి. నగరి డివిజన్‌కు 277 క్వింటాళ్లు కేటాయించగా 160 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఉద్దుల విషయంలో నగరి డివిజన్‌కు 170 క్వింటాళ్లు, పలమనేరు డివిజన్‌కు 45 క్వింటాళ్లు కేటాయించారు. నగరి డివిజన్‌కు కేటాయించిన మొత్తం ఉద్దుల విత్తనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వర్షాలు లేక ప్రధాన పంటల సాగు సాధ్యం కాని పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న భూముల్లో వీలైనంత మేరకు ఉలవలు, ఉద్దులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. తక్కువ నీటితో సాగు చేసుకునే ఈ పంటలకు ప్రభుత్వం భారీ సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. మొత్తంగా జిల్లాలో 26,887 హెక్టార్ల భూమి ఖరీఫ్ సాగుకు దూరంగా ఉండటం కరువు తీవ్రతను స్పష్టం చేస్తోంది. వర్షాభావంతో ప్రధాన పంటలు దెబ్బతిన్న వేళ ప్రత్యామ్నాయ పంటల సాగు రైతులకు కొంతమేర ఆదాయానికి మార్గంగా నిలిచే అవకాశం ఉంది. ఉలవలు, ఉద్దులు వంటి పంటలను ప్రోత్సహించడం ద్వారా బీడు భూములను సాగులోకి తీసుకురావడంతో పాటు రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించవచ్చన్నది అధికారుల అంచనా.

