రూ. 1,529.69 కోట్లతో చిత్తూరు ఉద్యానవన రంగానికి మహర్దశ
రూ. 1,529.69 కోట్లతో చిత్తూరు ఉద్యానవన రంగానికి మహర్దశ
27 మండలాల్లో 20 క్లస్టర్లుగా మూడేళ్లపాటు అమలు..
సూక్ష్మ సాగునీటికి రూ.620.40 కోట్లు..
మార్కెట్ వసతులకు రూ.77.11 కోట్లు
2న మదనపల్లిలో ప్రారంభించనున్న సీఎం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలో ఉద్యానవన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలోని ఉద్యానవన పంటల సాగు, నీటి వనరుల వినియోగం, ఉత్పాదకత పెంపు, పంట అనంతర నిర్వహణ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు తదితర అంశాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా రూ.1,529.69 కోట్లతో సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికను 27 మండలాల్లో 20 క్లస్టర్లుగా మూడు సంవత్సరాలపాటు దశలవారీగా అమలు చేయనున్నారు. అక్టోబర్ 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాకు ఈ భారీ ప్రాజెక్టును మంజూరు చేశారు. ఉద్యానవన రంగంలో ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వరకు ప్రతి దశలో అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాట్ల సామగ్రి, సాగునీటి సదుపాయాలు, మార్కెట్ అనుసంధానం కల్పించడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఉద్యానవన రంగం అభివృద్ధికి అత్యధికంగా సూక్ష్మ సాగునీటి పద్ధతులపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రూ.620.40 కోట్లను కేటాయించారు. రైతులకు సూక్ష్మ సాగునీటి సదుపాయాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో తరచూ ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యానవన పంటలకు నీటి లభ్యతను మెరుగుపరచడం ఈ నిధుల వినియోగంలో కీలక అంశంగా ఉండనుంది. డిమాండ్ ఆధారిత పంటల అభివృద్ధికి రూ.383.74 కోట్లు కేటాయించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయలు, పుష్పాలు, ఇతర ఉద్యానవన పంటలను గుర్తించి వాటి సాగును ప్రోత్సహించనున్నారు. రైతులు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటలను సాగు చేసేలా మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు పంటలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించనున్నారు. ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉద్యానవన పంటల ఉత్పాదకతను పెంచేందుకు రూ.162.80 కోట్లను కేటాయించారు. పాత తోటల పునరుద్ధరణ, కొమ్మల కత్తిరింపు, కీటక నియంత్రణ, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. తోటల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న తోటల ఉత్పాదకతను పెంచడంతో పాటు నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు అవకాశం కల్పించనున్నారు. మంచి వ్యవసాయ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాల అమలుకు రూ.28.85 కోట్లు కేటాయించారు. సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక నిర్వహణ, పంటల నాణ్యత, ధ్రువీకరణ ప్రక్రియలపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉద్యానవన ఉత్పత్తుల నాణ్యతను పెంచే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మార్కెట్ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.77.11 కోట్లు కేటాయించారు. సేకరణ కేంద్రాలు, గ్రేడింగ్, ప్యాకింగ్ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, డిజిటల్ ధరల ప్రదర్శన బోర్డులు, బ్రాండింగ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. రైతులు పంటలను నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి మెరుగైన ధర పొందేలా మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయనున్నారు. పంట అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి రూ.84.96 కోట్లు కేటాయించారు. ప్యాక్‌హౌస్‌లు, ప్రీ-కూలింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, రైపెనింగ్ ఛాంబర్లు, శీతలీకరణ వాహనాలు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పంట కోత అనంతరం నిల్వ, రవాణా సమయంలో జరిగే నష్టాలను తగ్గించడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకుని అనుకూల ధర వచ్చినప్పుడు విక్రయించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధికి రూ.23 కోట్లు కేటాయించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా రైతులను సమీకరించి ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను చేపట్టేలా ప్రోత్సహించనున్నారు. నాణ్యమైన మొక్కల సరఫరాకు రూ.21 కోట్లు కేటాయించి నాణ్యమైన నాట్ల సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.17.21 కోట్లు కేటాయించారు. ఉద్యానవన పంటల్లో ఆధునిక యంత్రాలను వినియోగించడం ద్వారా సాగు ఖర్చులు, శ్రమ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అగ్రోసన్, సామూహిక నిర్మాణాలకు రూ.17.40 కోట్లు కేటాయించారు. సాంకేతిక విస్తరణ, రైతు ప్రదర్శన కార్యక్రమాలకు రూ.16.13 కోట్లు, ఇతర క్లస్టర్ ఆధారిత కార్యక్రమాలకు రూ.67.09 కోట్లు కేటాయించారు.
మూడు దశల్లో 20 క్లస్టర్లు
ఈ ప్రణాళికను మూడు సంవత్సరాల్లో మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో 2026-27 సంవత్సరానికి 5 క్లస్టర్లు, 7 మండలాలను ఎంపిక చేశారు. పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, రామకుప్పం, కుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మామిడి, టమాటా, కూరగాయలు తదితర ఉద్యానవన పంటలు అధికంగా సాగయ్యే ప్రాంతాల్లో నీటి వనరులు, తోటల పునరుద్ధరణ, మార్కెట్ అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండో దశలో 2027-28 సంవత్సరానికి 8 క్లస్టర్లను, మూడో దశలో 2028-29 సంవత్సరానికి 7 క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రెండో దశలో పెద్దపంజాణి, గంగవరం, పులిచెర్ల, రొంపిచెర్ల, బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల తదితర ప్రాంతాల్లో ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. మూడో దశలో చిత్తూరు, గుడిపాల, పూతలపట్టు, యాదమరి, వెదురుకుప్పం, పెనుమూరు, గంగాధర నెల్లూరు, పాలసముద్రం, ఎస్.ఆర్.పురం, కార్వేటినగరం, నగరి, నిండ్ర, విజయపురం ప్రాంతాల్లో కార్యక్రమాలను విస్తరించనున్నారు.
రైతు ఆదాయమే ప్రధాన లక్ష్యం
ప్రాజెక్టు ద్వారా కేవలం పంటల సాగును పెంచడమే కాకుండా ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సమగ్ర విలువ గొలుసును ఏర్పాటు చేయనున్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, ఆధునిక సాగు పద్ధతులు, సూక్ష్మ సాగునీటి సదుపాయాలు అందించడం, దిగుబడిని పెంచడం, పంట అనంతర నష్టాలను తగ్గించడం, గ్రేడింగ్, ప్యాకింగ్, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించనున్నారు. పంటలకు విలువను జోడించి ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను మార్కెట్‌కు అందించడం, బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందేలా చేయడం, ఎగుమతి అవకాశాలను పెంచడం కూడా ప్రణాళికలో భాగంగా ఉంది. తద్వారా చిత్తూరు జిల్లాలోని ఉద్యానవన రైతులకు సాగు నుంచి విక్రయం వరకు ప్రభుత్వ సహకారం అందేలా సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.1,529.69 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 27 మండలాల్లో ఉద్యానవన రంగానికి అవసరమైన నీటి వనరులు, ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, పంట అనంతర నిర్వహణ, మార్కెటింగ్, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి అన్ని అంశాలను అనుసంధానం చేయనున్నారు. మూడు సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా కార్యక్రమాలను అమలు చేసి చిత్తూరు జిల్లాను ఉద్యానవన ఉత్పత్తులలో మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

