యుద్ధాల సెగ.. మామిడి రైతుకు దెబ్బ!
యుద్ధాల సెగ.. మామిడి రైతుకు దెబ్బ!
పల్ప్ ఎగుమతులకు బ్రేక్.. ఫ్యాక్టరీల్లో లక్షల టన్నుల నిల్వలు
నెలలు గడుస్తున్నా రైతులకు అందని బిల్లులు
కిలోకు రూ.4 రాయితీపైనా కొరవడని నిబంధనల చిక్కులు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
యుద్ధాల మంట మామిడి రైతుల కడుపు కొడుతోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు.. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు.. వెరసి చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, సముద్ర రవాణాలో ఆటంకాలు, రవాణా వ్యయం భారీగా పెరగడంతో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఫ్యాక్టరీల్లో పల్ప్ నిల్వలు పేరుకుపోతుండగా, రైతులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. కష్టపడి పండించిన పంటను ఫ్యాక్టరీలకు తరలించిన రైతులు తమ డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు బిల్లులు చేతికందుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ కీలక ఆర్థిక రంగంగా ఉంది. ఈ సీజన్లో జిల్లాలోని 35 మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు సుమారు 3.65 లక్షల టన్నుల మామిడికాయలను గుజ్జు తయారీకి వినియోగించాయి. వీటి ద్వారా సుమారు 1.80 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఉత్పత్తి చేసినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అయితే ఉత్పత్తి ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. గతంలో తయారు చేసిన గుజ్జు నిల్వలు కూడా కొంతమేర ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. చిత్తూరు జిల్లాలో తయారయ్యే మామిడి గుజ్జుకు విదేశీ మార్కెట్లే ప్రధాన ఆధారం. స్థానికంగా, దేశీయంగా పెద్దఎత్తున వినియోగం లేకపోవడంతో గల్ఫ్ దేశాలకు జరిగే ఎగుమతులపైనే పరిశ్రమ ఎక్కువగా ఆధారపడుతోంది. అక్కడికి సరుకు చేరకపోవడం, కొత్త ఆర్డర్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్యాక్టరీలకు నగదు ప్రవాహం తగ్గిపోయింది. ఎగుమతులు నిలిచిపోతే దాని ప్రభావం నేరుగా మామిడి రైతుల బిల్లుల చెల్లింపులపై పడుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలతో హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో సముద్ర రవాణా తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. నౌకల ప్రయాణ మార్గాల్లో మార్పులు, యుద్ధ ప్రమాద బీమా వ్యయం పెరగడం, రవాణా సంస్థలు విధిస్తున్న అదనపు ఛార్జీలు ఎగుమతిదారులకు భారంగా మారుతున్నాయి. గతంలో కంటైనర్ రవాణాకు సుమారు 1,000 డాలర్లు ఖర్చయ్యే చోట ప్రస్తుతం 6,000 నుంచి 7,000 డాలర్ల వరకు వ్యయం అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదలతో మామిడి గుజ్జు ఎగుమతులు లాభసాటిగా లేకుండా పోతున్నాయి. పెరిగిన రవాణా భారాన్ని కలుపుకుని విదేశీ కొనుగోలుదారులకు ధర చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉత్పత్తి సిద్ధంగా ఉన్నా సరుకు బయటకు వెళ్లడం లేదు. సాధారణంగా మామిడికాయలు ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన నెల రోజుల్లోగా రైతులకు బిల్లులు చెల్లించేవారు. గత ఏడాది కూడా చెల్లింపుల్లో జాప్యం జరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో చెల్లింపులపై మరింత అనిశ్చితి నెలకొంది. ఇప్పటివరకు చాలా మంది రైతులకు బిల్లులు అందలేదని తెలుస్తోంది. కొన్ని ఫ్యాక్టరీలు గతంలో తయారుచేసిన పల్ప్ నిల్వలను విక్రయించి, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో రైతులకు బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎగుమతులు ఎప్పుడు పుంజుకుంటాయి? ఫ్యాక్టరీలకు నగదు ఎప్పుడు అందుతుంది? రైతుల బకాయిలు ఎప్పటికి తీరుతాయి? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే మామిడి పరిశ్రమతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.
*రూ.4 రాయితీకి నిబంధనల అడ్డంకులు*
మరోవైపు మామిడి రైతులకు ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 రాయితీపై కూడా రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ రాయితీ పొందేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించడంతో అర్హులైన రైతుల వివరాల సేకరణ, జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఎకరాకు 7 టన్నుల వరకు సరఫరా చేసిన మామిడికాయలకే రాయితీ వర్తించేలా నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూమి ఎవరి పేరుపై ఉంటే వారి పేరుతోనే ఫ్యాక్టరీకి మామిడికాయలు సరఫరా చేసి ఉండాలని, ఇతరుల పేర్లతో సరఫరా చేసిన సందర్భాల్లో రాయితీ వర్తించదని చెబుతున్నారు. మామిడికాయలు సరఫరా చేసిన రైతులకు భూమి ఉండటంతో పాటు, గతంలోనూ ఫ్యాక్టరీలకు మామిడికాయలు సరఫరా చేసిన ఆధారాలు ఉండాలని నిబంధనలు విధించినట్లు సమాచారం. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న రైతులతో తొలి జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ఉద్యానవన శాఖ వర్గాలు వెల్లడించాయి. రెండో జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 10 రోజుల్లో దానిని కూడా ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని తెలిపాయి. రెండు జాబితాలను పరిశీలించిన అనంతరం రాయితీ చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండో జాబితా ప్రభుత్వానికి చేరిన తర్వాత అర్హతల పరిశీలన, తదుపరి నిర్ణయాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రక్రియకు సుమారు నెల రోజుల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటివరకు రైతులు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన బిల్లులతో పాటు ప్రభుత్వ రాయితీ కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం.. మరోవైపు ఫ్యాక్టరీల వద్ద పేరుకుపోతున్న నిల్వలు.. ఇంకోవైపు అందని బిల్లులు, ఆలస్యమవుతున్న రాయితీ.. ఇలా చిత్తూరు జిల్లా మామిడి రైతులు నాలుగు వైపులా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు ఎగుమతులపై చూపుతున్న ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, రైతులకు బకాయిలు త్వరగా అందేలా ప్రభుత్వం, సంబంధిత శాఖలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.

