5, అక్టోబర్ 2026, సోమవారం

జడ్పీ పీఠంపై పలువురి టీడీపీ నేతల కన్ను!

జడ్పీ పీఠంపై పలువురి టీడీపీ నేతల కన్ను!

అదృష్టాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు..

సీఎం చంద్రబాబు, లోకేష్‌ చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

ఎమ్మెల్యేల ద్వారా కొందరు.. అధిష్ఠానం పరపతితో మరికొందరు

డజనుకుపైగా నేతల మధ్య జోరుగా సాగుతున్న పోటీ

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చిత్తూరు జిల్లా పరిషత్‌ పీఠంపై తెలుగుదేశం పార్టీ నేతల కన్ను పడింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. జడ్పీటీసీగా గెలుపొంది, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని అధిష్ఠించాలని డజనుకు పైగా ఆశావహులు కలలు కంటున్నారు. ఇందుకోసం కొందరు స్థానిక శాసనసభ్యుల ద్వారా ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొందరు పార్టీ అధిష్ఠానంలో తమకున్న పరిచయాలు, పరపతిని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ద్వారా పదవిని దక్కించుకునేందుకు కొందరు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా ఎన్నికల పరిశీలకుల వద్ద కూడా తమ మనసులోని మాటను చెబుతూ ఆశావహులు లాబీయింగ్‌ మొదలుపెట్టారు.

జిల్లా పరిషత్‌ విభజన అనంతరం చిత్తూరు జిల్లా పరిషత్‌ పరిధిలో 27 మండల పరిషత్తులు కొనసాగనున్నాయి. ఈ 27 మండలాల నుంచి ఎన్నికయ్యే జడ్పీటీసీ సభ్యుల్లో మెజారిటీ సభ్యుల మద్దతుతో చైర్మన్‌ ఎంపిక కానున్నారు. దీంతో ఒక్కసారి జడ్పీ చైర్మన్‌ పీఠం దక్కితే జిల్లా రాజకీయాల్లో కీలక స్థానం లభిస్తుందన్న భావన నేతల్లో నెలకొంది. జిల్లా పరిషత్‌ ద్వారా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుండటంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించే అవకాశం ఉండటం ఈ పదవికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఫలితంగా జిల్లాలోని అత్యున్నత రాజకీయ పీఠాల్లో ఒకటైన జడ్పీ చైర్మన్‌ పదవి కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

చిత్తూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, చిత్తూరు ఎంపీపీగా పనిచేసిన చంద్రప్రకాష్‌ ఈసారి జడ్పీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన సతీమణి గీర్వాణి చంద్రప్రకాష్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేయడం ఆయనకు అదనపు బలంగా భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచయాలు, ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉండటంతో ఈసారి తనకు అవకాశం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు చేక్కుడు కుప్పం షణ్ముగరెడ్డి పేరు కూడా జడ్పీ చైర్మన్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు సమాచారం. బంగారుపాళ్యానికి చెందిన ఎన్‌.పి. జయప్రకాశ్‌ నాయుడు కూడా జడ్పీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, బంగారుపాళ్యం ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. చిత్తూరు రూరల్‌ మండలానికి చెందిన చంద్రయ్య నాయుడు, ఐరాల మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సుచిత్ర కన్నయ్య కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. సుచిత్ర కన్నయ్య గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఆమె కూడా జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు సహకార డెయిరీ మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పేరు కూడా జడ్పీ చైర్మన్‌ రేసులో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ పదవిని ఆశించిన దొరబాబు, అందుకోసం చిత్తూరు మండలం నుంచి సింగిల్‌ విండో అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. అయితే అధిష్ఠానం ఆ పదవిని అమాస రాజశేఖర్‌రెడ్డికి కట్టబెట్టింది. దీంతో ప్రస్తుతం దొరబాబు దృష్టి జడ్పీ చైర్మన్‌ పదవిపై పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలసముద్రం మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు కూడా జడ్పీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు థామస్‌ ఆయనకు అండగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వి కోట మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామచంద్ర కూడా జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు పీఎస్ మునిరత్నం కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం పీఎస్‌ మణిరత్నం ఆర్టీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో జడ్పీ పదవికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన గౌనివారి శ్రీనివాసులు కూడా జడ్పీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం గతంలో చేసిన సేవలు, వివిధ పదవుల్లో పనిచేసిన అనుభవం తనకు అనుకూలంగా మారుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్య కూడా ఈ రేసులోకి వచ్చినట్లు సమాచారం. చిత్తూరు నగరపాలక సంస్థ చైర్మన్‌ పదవిని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కని పక్షంలో తన పేరును జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి పరిశీలించాలని ఆమె కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇలా చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం కోసం డజనుకు పైగా టీడీపీ నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల అండతో ముందుకు వెళ్తుండగా.. మరికొందరు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్టీ ఎన్నికల పరిశీలకుల వద్ద తమ అభ్యర్థిత్వాన్ని బలంగా వినిపిస్తున్నారు. అయితే చివరకు అధిష్ఠానం ఎవరిపై మొగ్గు చూపుతుంది? ఎవరి రాజకీయ అనుభవం, పార్టీ సేవలు, సామాజిక సమీకరణాలు, స్థానిక బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటుంది? అన్నదే ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జడ్పీ పీఠం కోసం మొదలైన ఈ పోటీలో చివరకు అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *