జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న యంత్రాలు
జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న యంత్రాలు
ఫోటోలకు ఫోజులిస్తున్న ఉపాధి కూలీలు
11 మండలాల్లో భారీగా పెరిగిన ఉపాధి పనులు
కూలీలకు దక్కేది రోజుకు 100 రూపాయలే
రూ.200 పంచుకుంటున్న స్థానిక నేతలు, ఉపాధి హామీ సిబ్బంది
జిల్లా అధికారులకు తెలిసినా, తెలియనట్లు వ్యవహారం
అక్రమార్కుల పాలవుతున్న ఉపాధి హామీ నిధులు
జిల్లాలో నీరుగాలుతున్న విబిజి రాంజీ పనులు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని చూపించాలి.. కానీ జిల్లాలో జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నం. కూలీలు ఫొటోలకు ఫోజులిస్తుంటే.. పనులను మాత్రం యంత్రాలు చేసేస్తున్నాయి. గడ్డపార, పార చేతబట్టి కూలీలు ఒకసారి ఫొటోలో కనిపిస్తే చాలు.. ఆ తర్వాత జేసీబీ, పొక్లెయిన్లు రంగంలోకి దిగుతున్నాయి. పని పూర్తయిన తర్వాత కూడా కూలీలను అక్కడికి తీసుకొచ్చి హాజరు ఫొటోలు తీసి, పనులు జరిగినట్లు రికార్డులు తయారు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. కూలీలకు రూ.100 ఇచ్చి.. మిగిలిన రూ.200ను స్థానిక నేతలు, ఉపాధి హామీ సిబ్బంది పంచుకుంటున్న వ్యవహారం క్షేత్రస్థాయిలో సాగుతోంది. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా.. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ పరిస్థితికి తోడు ఉపాధి హామీ పనుల గణాంకాల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో జిల్లాలో 2.88 లక్షల పని దినాలు నమోదైతే.. ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 4.11 లక్షలకు చేరాయి. అంటే ఒక్క నెలలోనే 1.23 లక్షల పని దినాలు అదనంగా నమోదయ్యాయి. పెరుగుదల 42.7 శాతం. ఈ పెరుగుదలలో కొన్ని మండలాలు అసాధారణంగా ముందున్నాయి. యాదమరిలో గత ఏడాది ఆగస్టులో 4,865 పని దినాలు ఉండగా.. ఈ ఏడాది 26,150కు చేరాయి. అంటే 21,285 పని దినాలు పెరిగాయి. నిండ్రలో 3,948 నుంచి 19,712కు పెరిగి 15,764 పని దినాలు అదనమయ్యాయి. బైరెడ్డిపల్లెలో 6,698 నుంచి 19,646కు పెరిగి 12,948, కార్వేటినగర్‌లో 9,545 నుంచి 20,591కు పెరిగి 11,046, బంగారుపాళ్యంలో 5,421 నుంచి 14,587కు పెరిగి 9,166 పని దినాలు అదనంగా నమోదయ్యాయి. ఇక పెద్దపంజాణిలో 4,037 నుంచి 12,622కు చేరి 8,585, జీడీనెల్లూరులో 5,319 నుంచి 13,766కు చేరి 8,447, ఐరాలలో 6,035 నుంచి 13,918కు చేరి 7,883, పెనుమూరులో 6,925 నుంచి 13,866కు చేరి 6,941, శాంతిపురంలో 7,401 నుంచి 13,195కు చేరి 5,794, పాలసముద్రంలో 10,709 నుంచి 16,122కు చేరి 5,413 పని దినాలు పెరిగాయి.
*11 మండలాల్లో లక్షకుపైగా పనిదినాలు*
మొత్తంగా ఈ 11 మండలాల్లోనే గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే లక్షకు పైగా అదనపు పని దినాలు నమోదయ్యాయి. ముఖ్యంగా యాదమరి, నిండ్ర, బైరెడ్డిపల్లె, కార్వేటినగర్ మండలాల్లో పెరుగుదల తీవ్రంగా ఉంది. యాదమరిలో దాదాపు 5.4 రెట్లు, నిండ్రలో దాదాపు 5 రెట్లు పని దినాలు పెరగడం గమనార్హం. ఉపాధి పనుల్లో కూలీల హాజరును నమోదు చేసేందుకు తీసే ఫొటోలే ఇప్పుడు అసలు పనికి ప్రత్యామ్నాయంగా మారాయి. ఉదయం కూలీలను పనిముట్లతో ఒకచోట నిలబెట్టి ఫొటో తీస్తారు. కూలీలు పని చేస్తున్నారనే ఆధారం రికార్డుల్లో ఉండటంతో అసలు పనిని యంత్రాలతో చేయించేందుకు మార్గం సుగమమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో పని ప్రారంభానికి ముందే కూలీల ఫొటోలు తీసి.. ఆ తర్వాత యంత్రాలతో మట్టి తవ్వకాలు, గుట్టల తొలగింపు వంటి పనులు పూర్తి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల యంత్రాలతో పని పూర్తయిన తర్వాత కూలీలను అక్కడికి తీసుకొచ్చి కొద్దిపాటి మట్టి తీయించడం, అంచులు సరిచేయించడం ద్వారా మొత్తం పనిని కూలీలే చేసినట్లు చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
*ముందుకురాని కూలీలు*
వర్షాభావంతో భూమి గట్టిపడిపోవడం, మట్టి తవ్వడం కష్టంగా మారడం వంటి కారణాలను చూపుతూ యంత్రాలను వినియోగిస్తున్నారు. కానీ ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం కూలీలకు పని కల్పించడమే. అలాంటప్పుడు కూలీల పేరుతో పని దినాలు నమోదు చేసి.. యంత్రాలతో పని చేయించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఒక పని జేసీబీతో కొద్దిరోజుల్లో పూర్తవుతుంది. అదే పనికి కూలీలను 20, 30 రోజుల పాటు హాజరైనట్లు చూపిస్తే.. పని దినాలు అమాంతం పెరిగిపోతాయి. రికార్డుల్లో కనిపించేది కూలీల పని.. క్షేత్రస్థాయిలో కనిపించేది యంత్రాల పని. ఈ వ్యవహారంలో చివరకు నష్టపోయేది కూలీనే. తన పేరుతో పని దినాలు నమోదవుతున్నా.. ప్రభుత్వం చెల్లించాల్సిన పూర్తి మొత్తంలో కేవలం రూ.100 మాత్రమే చేతికి అందుతున్న పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలిసినా.. ప్రశ్నించే పరిస్థితి కూలీలకు ఉండటం లేదు. కూలీ పేరుతో నమోదయ్యే మొత్తంలో మిగిలిన రూ.200ను స్థానికంగా ప్రభావం ఉన్న వ్యక్తులు, ఉపాధి హామీ సిబ్బంది పంచుకుంటున్న వ్యవహారం గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉంది. కూలీకి పని లేకుండానే పని దినం.. యంత్రానికి కూలీ లేకుండానే పని.. మధ్యలో రికార్డుల ఆధారంగా నిధుల మళ్లింపు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి.
*అవినీతిలో అందరూ భాగస్తులే*
ఉపాధి పనుల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, మండలస్థాయిలో సాంకేతిక సిబ్బంది, ఏపీఓలు, జిల్లాస్థాయిలో అధికారులు ఉన్నారు. ఏ గ్రామంలో ఏ పని జరుగుతోంది.. ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు.. ఎన్ని పని దినాలు నమోదవుతున్నాయి.. ఎంత మేరకు పని పూర్తయింది.. అన్న సమాచారం అధికారుల వద్ద ఉంటుంది. అయినా యంత్రాలతో పనులు జరుగుతున్నా, కూలీల ఫొటోలు మాత్రమే తీస్తున్నా, పాత పనులను కొత్తవిగా చూపిస్తున్నా పట్టించుకోకపోవడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉపాధి హామీ నిధులు గ్రామీణ పేదలకు నేరుగా ఉపయోగపడాల్సినవి. కూలీలకు పని కల్పించి వారి కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించాల్సిన పథకంలో అక్రమాలు చోటుచేసుకుంటే అసలు లక్ష్యమే దెబ్బతింటుంది. పని దినాలు పెరిగాయని చెప్పుకోవడం కంటే.. ఆ పని ఎవరు చేశారు? ఎంత పని చేశారు? కూలీకి ఎంత చేరింది? యంత్రానికి ఎంత చెల్లించారు? అన్నదే అసలు ప్రశ్న.
*ఫోటోలకు మాత్రమే పోజు*
కూలీల చేతుల్లో పనిముట్లు.. ఫొటోలో మాత్రమే పని.. క్షేత్రస్థాయిలో యంత్రాల జోరు.. రికార్డుల్లో భారీగా పని దినాలు.. ఇదే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉపాధి పనుల వాస్తవ చిత్రం. అధికారిక గణాంకాల ప్రకారం ఆగస్టు పని దినాలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. ముఖ్యంగా యాదమరి, నింద్ర, బైరెడ్డిపల్లె, కార్వేటినగర్ తదితర మండలాల్లో పెరుగుదల గణనీయంగా ఉంది. ఈ పెరుగుదల వెనుక నిజంగా కూలీలకు పెరిగిన ఉపాధే కారణమా? లేక యంత్రాలతో పనులు చేయించి, కూలీల పేర్లతో పని దినాలు పెంచుతున్నారా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఒక్కసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఫొటోలు, మస్టర్ రోల్స్, పని కొలతలు, చెల్లింపు వివరాలు, వాస్తవ పనిని సరిపోల్చితే అసలు బాగోతం బయటపడే అవకాశం ఉంది.

