4, అక్టోబర్ 2026, ఆదివారం

ఇద్దరు ఉపాధి హామీ ఏపీవోలు సస్పెన్షన్

ఇద్దరు ఉపాధి హామీ ఏపీవోలు సస్పెన్షన్

పని దినాల కల్పనలో వెనుకబాటు.. 

వీబీజీ రామ్‌జీ పథకం లక్ష్యాలపై రాష్ట్రస్థాయి ఒత్తిడి

గంగవరం, పులిచర్ల ఏపీవోలపై వేటు

కరువు పరిస్థితుల్లో పనులకు కూలీల ఆసక్తి కరువు..

 అధికారుల ఒత్తిడితో అక్రమాలకు తెర?

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

వీబీజీ రామ్‌జీ పథకం కింద కూలీలకు పని దినాల కల్పనలో వెనుకబడిన ఇద్దరు ఏపీవోలపై జిల్లా అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. గంగవరం ఏపీవో శ్రీనివాస యాదవ్‌, పులిచర్ల ఏపీవో సౌభాగ్యవతిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పని దినాల కల్పనలో మండలాలు వెనుకబడటంపై రాష్ట్రస్థాయిలో జరిగిన సమీక్షలో ఈ రెండు మండలాల పనితీరు ప్రస్తావనకు రావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

వీబీజీ రామ్‌జీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందంజలో ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పనను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ పనులు కూడా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ పని దినాలు కల్పించి గ్రామీణ కూలీలకు ఆదాయ భరోసా కల్పించాలనే ఉద్దేశంతో లక్ష్యాలను పెంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పని దినాల కల్పనపై రాష్ట్రస్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనితీరు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అన్ని జిల్లాల్లో పని దినాల సంఖ్యను పెంచాలని రాష్ట్రస్థాయి నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు మండలాలపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. రాయలసీమ జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లా ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పనలో వెనుకబడినట్లు రాష్ట్రస్థాయి సమీక్షలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రాష్ట్రస్థాయి జాయింట్‌ కమిషనర్‌ సమీక్ష నిర్వహించిన సందర్భంగా తక్కువ పని దినాలు కల్పించిన మండలాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో గంగవరం, పులిచర్ల మండలాలు వెనుకబడినట్లు గుర్తించి ఆయా మండలాల అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా స్థాయిలో విచారణ అనంతరం ఇద్దరు ఏపీవోలను సస్పెండ్‌ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అధికారుల లక్ష్యాలకు భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో ఉదయం నుంచే బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలు లేక భూమి గట్టిపడిపోవడంతో ఉపాధి హామీ పనులు చేయడం కూలీలకు కష్టంగా మారింది. పలుగు, పార పట్టుకుని మట్టి పనులు చేస్తే చేతులకు బొబ్బలు వస్తున్నాయని కూలీలు చెబుతున్నారు. తీవ్ర ఎండ, కఠినమైన భూమి, తగినంత కూలి దక్కకపోవడం వంటి కారణాలతో చాలామంది కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో పైస్థాయి నుంచి మాత్రం పని దినాల సంఖ్యను పెంచాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. లక్ష్యాలను చేరుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై, అక్కడి నుంచి మండల స్థాయి అధికారులపై పడుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు, అధికారిక గణాంకాల్లో చూపుతున్న పని దినాలకు మధ్య వ్యత్యాసం ఏర్పడే ప్రమాదం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్ష్యాలను ఎలాగైనా సాధించాలనే ఒత్తిడి పెరిగితే క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కూలీలు ముందుకు రాని సందర్భాల్లో పనులను యంత్రాలతో చేయించి, వాటిని ఉపాధి హామీ పనులుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జేసీబీలతో మట్టి పనులు చేయించడం, కూలీల పేర్లపై పని దినాలు నమోదు చేయడం వంటి అక్రమాలకు అవకాశం ఏర్పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు వాస్తవమా కాదా అన్నది అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామీణ కూలీలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం. కూలీలతో చేయాల్సిన పనులను యంత్రాలతో చేయిస్తే పథకం లక్ష్యమే దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలీలకు అందాల్సిన ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో గ్రామీణ కుటుంబాల ఆదాయంపై ప్రభావం పడుతుంది. మరోవైపు యంత్రాలను ఉపయోగించి పనులు పూర్తి చేసినట్లు చూపిస్తే ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం జిల్లా అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఇదే. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితుల్లో కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో కూలీలు పనులకు రావడానికి సిద్ధంగా లేని పరిస్థితి నెలకొంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుండా కేవలం గణాంకాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరిగి అక్రమాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల పని దినాల సంఖ్యను పెంచడంతోపాటు పనుల నాణ్యత, కూలీల హాజరు, మస్టర్ల నమోదు, చెల్లింపులు, పనులు జరిగిన ప్రదేశాలను అధికారులు నిరంతరం తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యంత్రాల వినియోగంపై కఠినంగా నిఘా పెట్టాలి. కూలీలకు వాస్తవంగా పని కల్పించకుండా కాగితాలపై మాత్రమే పని దినాలు పెంచితే రాష్ట్రస్థాయిలో జిల్లా ముందంజలో ఉన్నట్లు కనిపించినా, పథకం ఉద్దేశం మాత్రం నెరవేరదు. ఇద్దరు ఏపీవోల సస్పెన్షన్‌తో మండల స్థాయి సిబ్బందిలో కలకలం రేగింది. పని దినాల లక్ష్యాలను చేరుకోలేకపోతే తమపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న భయంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు లక్ష్యాలపై ఒత్తిడి చేయడంతోపాటు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కూలీలకు నిజమైన ఉపాధి కల్పించడం లక్ష్యమా.. లేక గణాంకాల్లో పని దినాల సంఖ్యను పెంచడం లక్ష్యమా అన్నది స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *