4, అక్టోబర్ 2026, ఆదివారం

ఆ పసికందు ఏం పాపం చేశాడు?

గంగ 6 తల్లిదండ్రులు వదిలి వెళ్ళిన బాలుడు


పుట్టగానే అనాథయ్యాడు.. ఆ పసికందు ఏం పాపం చేశాడు?

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

చిత్తూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రప్రభ బ్యూరో) : అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన ఆ పసికందు.. పుట్టిన కొద్దిసేపటికే ఒంటరివాడయ్యాడు. బోసి నవ్వులతో తల్లిదండ్రుల ముఖాలను చూడాల్సిన వయసులోనే అనాథగా మిగిలాడు. అభం శుభం తెలియని ఆ నవజాత శిశువు ఏ పాపం చేశాడో.. పుట్టగానే తల్లిదండ్రులు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియదు. కానీ ఈ ఘటన మాత్రం మానవ సంబంధాల్లో తగ్గిపోతున్న ప్రేమాభిమానాలను ప్రశ్నిస్తోంది.

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంరక్షించలేని పరిస్థితుల్లో వదిలివెళ్లేందుకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో శిశువును వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత శిశువు ఉన్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. వెంటనే పసికందును తమ సంరక్షణలోకి తీసుకుని వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మరింత మెరుగైన వైద్యం, ప్రత్యేక పర్యవేక్షణ కోసం శిశువును శిశు ప్రత్యేక సంరక్షణ విభాగానికి తరలించారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, శిశువు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తదుపరి నిబంధనల ప్రకారం ఐసీడీఎస్ అధికారులకు శిశువును అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

*ఆ తల్లిదండ్రులకు ఏ కష్టం వచ్చిందో..*

ఆ పసికందుకు ఈ ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియదు. తల్లి ఒడిని, తండ్రి చేతిని గుర్తించే వయసు కూడా రాలేదు. తనను ఎందుకు వదిలేశారో తెలుసుకునే పరిస్థితి అసలే లేదు. కేవలం పుట్టాడు.. అంతే. పుట్టిన వెంటనే ప్రేమను కోల్పోయాడు. ఆ తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం వచ్చిందో.. తమ బిడ్డను వదిలి వెళ్లేంతటి పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఆర్థిక ఇబ్బందులా.. కుటుంబ సమస్యలా.. సామాజిక పరిస్థితులా.. మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది. వారిని నిందించడం కంటే, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు అండగా నిలిచే వ్యవస్థలు మరింత బలపడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ పసికందు మాత్రం ఏ తప్పూ చేయలేదు. తనకు కావాల్సింది ఒక్కటే.. ప్రేమ. తల్లి ఒడిలో చోటు, తండ్రి చేతుల్లో భద్రత. అవి దక్కకముందే ఆసుపత్రి మంచంపై ఒంటరిగా మిగిలిపోయాడు. అదృష్టవశాత్తూ ఆసుపత్రి సిబ్బంది సమయానికి గుర్తించి శిశువును సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉన్నాడు. శిశువును ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు వదిలి వెళ్లారు? తల్లిదండ్రులు ఎవరు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఈ ప్రపంచంలోకి రావడానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఈ బిడ్డ మాత్రం పుట్టిన క్షణాల్లోనే ఒక ప్రశ్నగా మారిపోయాడు. ‘నేను ఏం పాపం చేశాను అమ్మా.. నాన్నా?’ అని అడిగే వయసు కూడా రాని ఆ పసిమొగ్గకు సమాజమే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయన్న ఆవేదనకు ఈ ఘటన ఒక మచ్చుతునకగా నిలిచింది. అదే సమయంలో పిల్లలను పెంచే పరిస్థితి లేని తల్లిదండ్రులు వారిని అనాథలుగా వదిలేయకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత మార్గాలను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *