మూడు ముక్కలైన చిత్తూరు జిల్లా పరిషత్
మూడు ముక్కలైన చిత్తూరు జిల్లా పరిషత్
65 మండలాలతో అతిపెద్ద జడ్పీకి తెర..
నేటి నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిషత్తులు
సిబ్బంది, వాహనాల పంపిణీ పూర్తి..
ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధం
చిత్తూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రప్రభ బ్యూరో) చిత్తూరు జిల్లా పరిషత్ మూడు ముక్కలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా పరిషత్గా కొనసాగిన చిత్తూరు జిల్లా పరిషత్ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిషత్తులుగా విడిపోయింది. శుక్రవారం నుంచి మూడు కొత్త జిల్లా పరిషత్తులు ప్రత్యేకంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. తిరుపతి జిల్లా పరిషత్తు చంద్రగిరిలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభం కానుంది. అలాగే మదనపల్లి జిల్లా పరిషత్తును పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ప్రారంభిస్తారు. ఇందుకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. మూడు జిల్లా పరిషత్తులకు సీఈవోలు, డిప్యూటీ సీఈవోల నియామకానికి కసరత్తు జరుగుతోంది.
జిల్లా పరిషత్ విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కూడా మూడు జిల్లాలకు మండలాల దామాషా ప్రకారం పంపిణీ చేశారు. మొత్తం 93 మంది సిబ్బందిలో చిత్తూరు జిల్లా పరిషత్‌కు 39 మంది, అన్నమయ్య జిల్లా పరిషత్‌కు 25 మంది, తిరుపతి జిల్లా పరిషత్‌కు 29 మందిని కేటాయించారు. పరిపాలనా అధికారులు 10 మందిలో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 3, తిరుపతికి 3 మంది చొప్పున కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్లు 19 మందిలో చిత్తూరుకు 8, అన్నమయ్యకు 5, తిరుపతికి 6 మంది వెళ్లనున్నారు. డిప్యూటీ సీఈవో స్థాయి సిబ్బంది 31 మందిలో చిత్తూరుకు 13, అన్నమయ్యకు 9, తిరుపతికి 9 మంది చొప్పున పంపిణీ చేశారు. స్టెనో పోస్టులు 2 ఉండగా చిత్తూరుకు ఒకటి, తిరుపతికి ఒకటి కేటాయించారు. ముద్రణ లేఖకులు 9 మందిలో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 2, తిరుపతికి 3 మంది, రికార్డు సహాయకులు 4 మందిలో చిత్తూరుకు 2, అన్నమయ్యకు ఒకరు, తిరుపతికి ఒకరు కేటాయించారు. డ్రైవర్లు ముగ్గురిలో ఒక్కొక్కరిని మూడు జిల్లా పరిషత్తులకు కేటాయించగా, కార్యాలయ సహాయకులు 15 మందిలో చిత్తూరుకు 6, అన్నమయ్యకు 4, తిరుపతికి 5 మంది చొప్పున పంపిణీ చేశారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన వాహనాలను కూడా మూడు జిల్లాలకు మండలాల దామాషా ప్రకారం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం కూడా ముగియడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. గురువారంతో ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగిసింది. శుక్రవారంతో జడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఎన్నికలు జరిగే వరకు మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకాలం ముగియడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అదే విధంగా మూడు కొత్త జిల్లా పరిషత్తుల పరిపాలన సజావుగా సాగేందుకు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకాలు, కార్యాలయాల ఏర్పాట్లు వంటి ప్రక్రియలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఒకప్పుడు 65 మండలాలతో విస్తరించిన చిత్తూరు జిల్లా పరిషత్ ఇకపై మూడు జిల్లాలుగా విడిపోయి కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. మూడు జిల్లా పరిషత్తులకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థలు ఏర్పడటంతో ఇక నుంచి స్థానిక సంస్థల పాలన కూడా కొత్త సరిహద్దుల పరిధిలో కొనసాగనుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఈ స్థానిక సంస్థలు కొనసాగనున్నాయి.

