పరిషత్ పోరుకు మోగిన ఎన్నికల నగారా
పరిషత్ పోరుకు మోగిన ఎన్నికల నగారా
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
చిత్తూరు, అక్టోబరు 19 (ఆంధ్రప్రభ బ్యూరో): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే మండలాల వారీగా రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24వ తేదీన పరిశీలన, 27వ తేదీన ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వివరించారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 370 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 27వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.
**ఎన్నికల వ్యయ పరిమితులు తప్పనిసరి**
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.8 లక్షల వరకు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే జనరల్, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 చొప్పున భద్రతా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జెడ్పీటీసీ స్థానాలకు జనరల్, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.6,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.3,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు.
**ప్రచారానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి**
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలో తహశీల్దారును నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ కేంద్రంగా ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీల ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మైకుల ద్వారా ప్రచారాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, ఇందుకు పోలీసుల లేదా రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల వినియోగానికి కూడా ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. కాలినడకన ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని ఏర్పాటు చేయరాదన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని సూచించారు. మతం, కులం ఆధారంగా ఓట్లు కోరడం, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై నిరాధార ఆరోపణలు చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు. వ్యక్తుల ఇళ్ల ముందు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించరాదని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అవగాహన చేసుకుని దాని ప్రకారం వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం, సంబంధిత ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి లేదా తహశీల్దారును సంప్రదించాలని తెలిపారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

