6, నవంబర్ 2026, శుక్రవారం

చిత్తూరు జడ్పీ పీఠం మహిళలకు రిజర్వు

చిత్తూరు జడ్పీ పీఠం మహిళలకు రిజర్వు

27 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. 

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపు

చిత్తూరు, అక్టోబరు 13 (ఆంధ్రప్రభ బ్యూరో): జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాన్ని మహిళలకు రిజర్వు చేశారు. జిల్లాలోని 27 మండల పరిషత్ అధ్యక్షుల స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవికుమార్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రిజర్వేషన్ల ప్రకటనతో జిల్లాలో స్థానిక రాజకీయాలు వేడెక్కనున్నాయి. మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.

జిల్లాలోని బైరెడ్డిపల్లె ఎంపీపీ స్థానాన్ని బీసీలకు కేటాయించగా, బంగారుపాళ్యం స్థానాన్ని జనరల్ మహిళలకు రిజర్వు చేశారు. చిత్తూరు, జీడీ నెల్లూరు స్థానాలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. గంగవరం, గుడిపాల స్థానాలు జనరల్ కేటగిరీలో ఉండగా, గుడుపల్లె స్థానాన్ని జనరల్ మహిళలకు కేటాయించారు. ఐరాల స్థానాన్ని ఎస్సీలకు, కార్వేటినగరం స్థానాన్ని జనరల్ కేటగిరీకి రిజర్వు చేశారు. కుప్పం స్థానాన్ని జనరల్ మహిళలకు, నగరి స్థానాన్ని బీసీ మహిళలకు కేటాయించారు. నిండ్ర స్థానాన్ని ఎస్సీలకు, పలమనేరు స్థానాన్ని జనరల్ కేటగిరీకి రిజర్వు చేశారు.

పాలసముద్రం, పెనుమూరు స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించగా, పెద్దపంజాణి స్థానాన్ని జనరల్ కేటగిరీలో ఉంచారు. పులిచెర్ల స్థానాన్ని బీసీలకు, పూతలపట్టు స్థానాన్ని జనరల్ కేటగిరీకి కేటాయించారు. రామకుప్పం స్థానాన్ని ఎస్టీ మహిళలకు, రొంపిచెర్ల స్థానాన్ని బీసీ మహిళలకు రిజర్వు చేశారు. ఎస్‌ఆర్‌ పురం స్థానాన్ని ఎస్సీ మహిళలకు కేటాయించగా, శాంతిపురం, తవణంపల్లి స్థానాలను జనరల్ కేటగిరీలో ఉంచారు. వి.కోట స్థానాన్ని బీసీలకు, వెదురుకుప్పం స్థానాన్ని జనరల్ మహిళలకు రిజర్వు చేశారు. విజయపురం స్థానాన్ని ఎస్సీలకు, యాదమరి స్థానాన్ని బీసీ మహిళలకు కేటాయించారు.

మొత్తం 27 ఎంపీపీ స్థానాల్లో 9 స్థానాలను జనరల్ మహిళలకు, 3 స్థానాలను బీసీ మహిళలకు, 3 స్థానాలను ఎస్సీ మహిళలకు, ఒక స్థానాన్ని ఎస్టీ మహిళలకు కేటాయించారు. మరోవైపు బీసీలకు 3, ఎస్సీలకు 3, జనరల్ కేటగిరీలో 8 స్థానాలు కేటాయించారు. ఈ రిజర్వేషన్లతో మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభించనుంది. ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ సామాజికవర్గానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు, పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *