వస్తోంది ... చంద్రన్న విడిచిన బాణం !?
5 నుండి నారా భువనేశ్వరి బస్సు యాత్ర
కుప్పం నుండి బస్సు యాత్ర ప్రారంభం
బస్సు యాత్రతో రాజకీయరంగ ప్రవేశం
బస్సు యాత్రకు రూట్ మ్యాప్ రెడీ
10 రోజుల పాటు రాయలసీమలో బస్సు యాత్ర
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గత 24 రోజులుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఆయనకు ఇప్పుడే బెయిలు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబు మీద వరుస కేసులను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు నమోదయ్యాయి. ఓటుకి నోటు కేసుల్లో కూడా విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అలాగే పుంగనూరులో పోలీసులపై దాడికి చంద్రబాబు ప్రేరేపించారన్న కేసు కూడా ఉంది. ఈ కేసులలో బెయిల్ పొంది బయటికి రావడానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. అధినేత జైలులో ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకత్వం కరువైంది. చంద్రబాబు నాయుడు దమనీయ స్థితిలో కేంద్ర కారాగారంలో రోజులు లెక్కబెడుతున్నారు. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ధైర్యం నింపి వారిని ఎన్నికలకు సమాయత్తం చేయడానికి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు.
చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. చంద్రబాబు విషయంలో సీనియర్ లాయర్లను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలనను కేంద్రం, జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని అనుకున్నా, పార్టీ పెద్దల నుండి సానుకూలత లభించలేదని తెలుస్తోంది. తండ్రి జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర చేయడం సమంజసం కాదని పార్టీ నేతలు లోకేష్ కు సర్దిచెప్పడంతో ఆయన యువగళం పాదయాత్రను విరమించుకున్నారు. ఇక లోకేష్ రాష్ట్రానికి వస్తే అరెస్టు చేస్తామని వైసీపీ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సిఐడి అధికారులు ఫైబర్ గ్రిడ్ కేసులో విచారణకు రావలసిందిగా లోకేష్ కు నోటీసులను అందజేశారు. ఈ నెల నాలుగో తేదీన లోకేష్ విచారణకు హాజరుకానున్నారు. లోకేష్ విచారణకు హాజరైతే ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేకుండా పోతుంది. నాయకత్వలేమిని పూరించడానికి నారా భువనేశ్వరి రాజకీయరంగ ప్రవేశం చేయవలసిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది.
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు నారా భువనేశ్వరి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనలేదు. జోక్యం చేసుకోలేదు. కనీసం చంద్రబాబుకు మస్ద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. వంటింటికే పరిమితమయ్యారు. అటువంటి నారా భువనేశ్వరి తమ కుటుంబానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి ప్రజల ముందుకు బస్సు యాత్ర ద్వారా వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి కుమార్తెగా, మరో ముఖ్యమంత్రికి భార్యగా నారా భువనేశ్వరి రాజకీయ రంగ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీకి నాయకత్వలేమి సమస్య తీరుతుందని భావిస్తున్నారు. ఆమె బస్సు యాత్ర ద్వారా ప్రజల మద్దతును మరింత చూడగానే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బస్సు యాత్ర విజయవంతమైతే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా భారీగా లబ్ది పొందే అవకాశం ఉంది. పార్టీ విజయ అవకాశాలు మెరుగుపడనున్నాయి.