కాణిపాకం ఆలయ చైర్మన్ ఎవరు?
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ చైర్మన్ పదవి కాలం ముగిసిన నేపధ్యంలో ఎవరు చైర్మన్ అవుతారన్న చర్చ రసవత్తరంగా జరుగుతుంది. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు ఉన్న పాలకమండలిని అలాగే కొనసాగించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో చైర్మన్ పీఠం ఎవరు దక్కించుకుంటారో అన్న ఉత్కంఠ పెరుగుతుంది. ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆలయ ఉభయదారుల ఒక్కరికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఒక వర్గం కోరుతోంది. ఈ సారి దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పూతలపట్టు MLA బాబును కలిసి వినతిపత్రం అందచేశారు. MLA కూడా సానుకూలంగా స్పందించారు.
శ్రీ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ పదవి కాలం ముగిసిన సమయంలో ఆశాబాహులు పలువురు తెరపైకి అరంగేట్రం చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో రాజకీయ అలజడి ప్రారంభం అయ్యింది. రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. సాధారణంగా MLA ప్రతిపాదనలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా జిల్లాలో ఏ రాజకీయ నియామకం జరగదు. కావున ఆశావహులు MLA తో పాటు, మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మొదటి నుండి కాణిపాక చైర్మన్ పదవి రేసులో మొదటి స్థానంలో అగరంపల్లి కి చెందిన చరణ్ రెడ్డి రేసులో ఉన్నప్పటికీ కూడా ఆయనను వరించలేదు. ఎమ్మెల్యే కూడా తనకే ఇస్తానని అన్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసి MLA మాట ప్రకారం విత్ డ్రా చేసుకోవాలని చరణ్ రెడ్డికి కాణిపాకం చైర్మన్ పదవికి కూడా సపోర్ట్ చేస్తామని ఉభయదారుల నాయకులు కూడా హామీ ఇచ్చారు. పార్టీకి నిజమైన కార్యకర్తగా, ఒక నాయకుడిగా మొదటి నుంచి కూడా చాలా ఖర్చు పెట్టుకున్నారు. అలాగే గుడి అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర కీలకంగానే ఉంది. అలాగే పార్టీ పెద్దల దీవెనలు కూడా ఇతనికి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈసారైనా చైర్మన్ పదవి వరిస్తుందా కల కలగానే మిగులుతుందా అనేది వేచిచూడాలి.
తెరపైకి ఇంకొక నాయకుడు మొదటినుంచి పార్టీ కోసం ఒక కార్యకర్తగా పనిచేస్తూ కాణిపాకం గుడి అభివృద్ధిలో చినకాంపల్లి చిన్నారెడ్డి భాగస్వామ్యం అవుతూనే ఉన్నారు. ఇతను కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. కాకపోతే చిన్నారెడ్డికి ఉభయ దారుల్లో కొంత వ్యతిరేకత ఉంది. మరి చైర్మన్ పదవి దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఇప్పుడు చైర్మన్ హోదాలో ఉన్న మోహన్ రెడ్డి మళ్ళీ తనకే కావాలని తను అభివృద్ధి చేశాననే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఆశీస్సులు ఇతనికి మెండుగా ఉన్నాయి. అయినప్పటికీ ఉభయదారుల వ్యతిరేకత వల్ల ఇతనికి మరొకసారి ఈ పీఠం దక్కుతుందా లేదో వేచి చూడాల్సిందే.
ఇంకా కొంతమంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా అంత బలమైన వారు కాకపోవడంతో చల్లబడి ఉన్నారు. మరి ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో ఆ వినాయక స్వామి ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో మరికొంత కాలం వేచి చూడాల్సిందే.