21, ఆగస్టు 2023, సోమవారం

భక్తుల మీదకు చిరుతలు ఎందుకు వస్తున్నాయి?

శేషాచలం అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరవు

పేలుళ్లు, కాల్పులతో భయపెడుతున్న స్మగ్లర్లు

యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్

అధికార పార్టీ వారే పుష్పా, వీరప్పన్ లు

అధికారుల అండదండలతో విజృంభన

10% కూడా పట్టుపడని ఎర్రచందనం



శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. అడవుల సంరక్షణకు ప్రకృతిపరంగా చిరుతలు, ఎలుగుబంట్లు, పులులు, పాములు తదితర వన్యప్రాణులు సృష్టించబడతాయి. ఈ వన్యప్రాణులు ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా తయారయ్యాయి. పలు మార్లు ఈ వన్యప్రాణులు స్మగ్లర్ల మీద దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అయిదారు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు కూలీలుగా రావడానికి ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దీనికి విరుగుడుగా స్మగ్లర్లు ఉపాయాన్ని ఆలోచించి, అడవిలో భారీ ఎత్తున టపాకాయలు, పేలుళ్లతో వన్యప్రాణులను వాటి స్థావరాల నుండి వెల్లగొట్టటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరి నిర్వాకం వల్లనే అడవిలోని చిరుత పులులు, ఎలుగుబంట్లు జనాల్లోకి వస్తున్నాయి.  ప్రతి నిత్యం శేషాచలం అడవుల నుంచి వివిధ మార్గాలలో కోట్ల విలువైన ఎర్ర చందనం అక్రమంగా తరలి పోతున్నది బహిరంగ రహస్యమే. 


 చంద్రగిరి, పీలేరు, రాయచోటి, రాజంపేట, కోడూరు, తిరుపతి నియోజక  వర్గాల నుంచి  చెన్నై, బెంగళూరుకు నిత్యం తరలిలిపోతున్నాయి. ఎక్కువగా రేణిగుంట, పుత్తూరు, నెండ్రగుంట , పెనుమూరు, జి డి నెల్లూరు, మదనపల్లి, పుంగనూరు మార్గాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోంది. దీని వెనుక అధికారం, పలుకుబడి ఉన్న కొందరు ప్రముఖ నాయకుల హస్తం ఉందని అందరికీ తెలిసిందే. అలాగే కొందరు అధికారులు కూడా లంచాలకు ఆశపడి దొంగలకు సహకరిస్తున్నాదీ బహిరంగ రహస్యమే. కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు కొందరిని అరెస్టు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎక్కువ సందర్భాలలో దొంగలను వదిలేసి దుంగలను పట్టుకొని మీడియాకు తెలియచేస్తున్నారు. ఇప్పటి వరకు దొరికిన చిన్న దొంగల ద్వారా అసలు దొంగల వివరాలు రాబట్ట లేక పోతున్నారు.  కేవలం అరెస్టులు, స్వాధీనం చేసుకున్న దుంగలు ఇతర వివరాలు పరిశీలించి మమా అనిపిస్తూ, సమగ్ర దర్యాప్తును గాలికి వదిలేస్తున్నారు. అసలు అడవుల్లో యే యే ప్రాంతాలలో ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా మారుస్తున్నారో అటవీ శాఖ వద్ద లెక్కలు లేవు. శక్తి వంత మైన డ్రోన్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను ఉపయోగించి దొంగల స్థావరాలు కనిపెట్టలన్న ప్రయత్నం కూడా జరగడం లేదు. చంద్ర మండలానికి రాకెట్లు, ఉపగ్రహాలను పంపగలుగుతున్న నేపథ్యంలో అడవి దొంగలను కనిపెట్ట లేక పోవడం వింతగా ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్యం, అధికారులకు చిత్తశుద్ది లేక పోవడం వల్లనే ఎర్ర చందనం దొంగలను నిర్మూలించ లేక పోతున్నారని ఆరోపిస్తున్నారు.


 ప్రత్యేక దర్యాపు బృదాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఉపయోగించి అక్రమ రవాణా అరికట్టాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వంకు లేకపోవడంతో  ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవులను తమ సొంత జాగీరా భావించి, ఎర్రచందనంను కొల్లకొడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక సహజ వనరులపై పడ్డారన్న ఆరోపణలున్నాయి. కావేవీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఇసుక, మైనింగ్, ఖనిజాల దోపిడీ జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేవదేవుడు కొలువైన శేషాచలం కొండలను వదలడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చిరుతల దాడుల వెనుక కోణాన్ని అందరూ ఒకవైపే చూస్తున్నారు. కానీ ఎర్రచందనం దొపిడీ ముఠాలు శేషాచలాన్ని ఆక్రమించడంతోనే చిరుతల జనావాసాల్లోకి వస్తున్నాయన్న సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. 


కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాచల అడవుల్లో ఏడు కొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్ష మంది తిరుమలకు వస్తుంటారు. వేల మంది నడక దారిలో ఏడుకొండలు ఎక్కుతుంటారు. తిరుమల కనుమదారిలో గతంలో తరచూ ఏనుగులు ప్రత్యక్షమయ్యేవి. కానీ అవి భక్తులకు ఎలాంటి హాని తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులుగా క్రూర మృగాలు భక్తుల నడకదారిలోకి వస్తున్నాయి. భక్తులపై దాడిచేస్తున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఇద్దరు చిన్నపిల్లలపై చిరుత పులులు దాడిచేశాయి. ఓ బాలుడు చిరు దాడి నుంచి బయటపడగా, చిన్నారి లక్షితను చిరుత చంపేసింది. ఈ దారిలో ఐదు చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు ఫ్లాష్‌ కెమెరాల సహాయంతో గుర్తించారు. ఇక ఎలుగుబంట్లు కూడా ఈ మార్గంలో తిరుగుతూ భక్తులను హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనిది చిరుతలు ఇలా ఎందుకు అడవి దాటి కనిపిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు భక్తుల నడకదారిలోకి వస్తున్నాయో తెలుసుకుందాం.


తిరుమల నడక దారిలోకి చిరుతలు, వన్యప్రాణులు ప్రవేశించడం వెనుక అసలు కారణం ఎర్రచందనం స్మగ్లింగ్‌. శేషాచల అడవుల్లో విచ్చలవిడిగా పేలుళ్లు జరుపుతుండటంతో వన్యప్రాణులు భయంతో జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అధికారులు, పాలకులు ఈ అంశంపై దృష్టిపెట్టకుండా భక్తులపై ఆంక్షలు విధిస్తున్నారు. శేషాచలం అడవులను ఎర్రచందనం ఖజానాగా పేర్కొంటారు. రోజూ టన్నుల కొద్దీ నరికి తరలించేస్తున్నా తరిగిపోని సంపద ఈ అడవుల్లో దాగి ఉంది. 


దశాబ్దాలుగా సాగుతున్న ఎర్ర చందనం అక్రమ నరికివేత వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లుగా ఊపందుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్‌ పేరుకే తప్ప క్రియాశీలంగా లేవు. అడవుల్లో కూంబింగ్, స్మగ్లర్లపై దాడులు, వెంటాడి పట్టుకోవడం వంటి చర్యలు దాదాపుగా లేవు. వాహనాలు అదుపు తప్పి తిరగబడి ఎర్రచందనం బయటపడితేనో, చెక్‌పోస్టుల్లో దొరికిపోతేనో మాత్రమే చందనం దుంగలు దొరికాయని లెక్కలు చెబుతున్నారు. దుంగలు దొరికినా దొంగలు మాత్రం దొరకరు. అరుదుగా దొంగలూ పట్టుబడ్డా, బలహీనమైన కేసులతో బయటపడి మళ్లీ అడవిబాట పడుతున్నారు. ఈ విధంగా శేషాచలంలో స్మగ్లర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా  పెరిగిపోతోంది. వారి కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేదు. విచ్చలవిడిగా చందనం చెట్లు నరికి పోగులుపెడుతున్నారు.


అడవులను గుప్పెట పెట్టుకుంటున్న క్రమంలో స్మగ్లర్లు అడవుల్లో తుపాకులు, మారణ ఆయుధాలతో సంచరిస్తుండడంతో ఏనుగులు, వన్యప్రాణులు అక్కడి నుంచి పారిపోతున్నాయి. ఈ స్మగ్లర్లే  బెదరగొడుతున్నారు. తమ స్మగ్లింగ్‌కు అడ్డుపడుతాయనే భయంతో అలజడి సృష్టిస్తున్నారు. ఏనుగులు, క్రూర మృగాలు తారసపడితే భీకర శబ్దాలు చేసి తరమడం, తుపాకులతో శబ్దాలు చేయడం. రాళ్లు విసరడం, నిప్పు రాజేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో జంతువులు అడవి దాటి పరుగులు తీస్తున్నాయని చెబుతున్నారు. ఎర్రచందరనం దుంగలతో పాటూ వన్యప్రాణుల మాంసం, చర్మం కూడా స్మగ్లర్లకు ఆదాయ మార్గంగా మారిందంటున్నారు. వేటాడేస్తున్నారు.


దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణుల స్థావరాల్లోకి ఎర్రదొంగలు వెళ్తుండడంతో వాటి ప్రశాంతకు భంగం కలుగుతోంది. దీంతో అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుమల ఘాట్‌ వైపు, కరకంబాడి, కల్యాణి డ్యామ్, తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వరకు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏకంగా అలిపిరి వద్దకొచ్చి.. అక్కడి నుంచి తిరుపతిలోకి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అటు శ్రీవారి భక్తుల్లో భయం మొదలైంది. ఇప్పటికైనా పాలకులు భక్తులపై ఆంక్షల గురించి కాకుండా.. అడవిలో అలజడిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎర్రదొంగలను పట్టుకుంటే అడవిని జంతువులకు వదిలేస్తే అవి తిరుమల భక్తులకు హాని తలపెట్టుకుంటా వాటి మానాన అవి ఉంటాయి. శక్తివంతమైన డ్రోన్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను ఉపయోగించి దొంగల స్థావరాలు కనిపెట్టి, ఎర్రచందనం దొంగలను నియంత్రణ చేయగలిగితే, చిరుతలు, ఎలుగుబంట్లు వాటి స్థావరాలలో ఉండి, భక్తులకి ఇబ్బంది ఉండదు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *